అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ సేకరించే 80 లక్షల టన్నులే కాకుండా ఎంత ధాన్యం వచ్చినా ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. అందుకోసం ఇప్పటి వరకు 7,183 కొనుగోలు కేంద్రాలు, 6,144 సెంటర్లు ఏర్పాటు చేశామని ప్రకటించారు.
ఇప్పటి వరకు 1.40 లక్షల మంది రైతుల నుంచి రూ.3,740 కోట్ల విలువైన 19.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. మరో 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ.15 వేల కోట్లను సీఎం కేసీఆర్ చొరవతో ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించారని గుర్తు చేశారు.
ధాన్యం సేకరణ ప్రక్రియ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. కొవిడ్ క్లిష్ట సమయంలోనూ క్షేత్రస్థాయిలో పౌరసరఫరాల సిబ్బంది నిరంతరం అందుబాటులోనే ఉంటారని మంత్రి గంగుల వెల్లడించారు.
ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష