Errabelli DayakarRao responded to the fake news on JPS : తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ గత కొన్నిరోజులగా ధర్నా చేస్తున్న జేపీఎస్‌లను.. ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్న వార్త వాస్తవం కాదని పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రభుత్వం తరపున ఎవరూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని పేర్కొన్నారు.
కార్యదర్శులు ఫోన్లో తనకు సమస్యలు చెప్పుకున్నారన్న మంత్రి... సమ్మె విరమించాలని తాను సూచించినట్లు తెలిపారు. కానీ, ప్రభుత్వం చర్చలకు పిలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని దయాకర్ రావు తెలిపారు. నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని మరోమారు స్పష్టం చేశారు.
జేపీఎస్‌లు సమ్మె చేయడం నిబంధనలకు, చట్టానికి విరుద్ధమని.. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని పేర్కొన్నారు. సంఘాలు ఏర్పాటు చేయబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్లకు దిగబోమని ప్రభుత్వానికి జేపీఎస్‌లు బాండ్ రాసిచ్చినట్లు గుర్తు చేశారు. రాసిచ్చిన ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదని దయాకర్ రావు ఆక్షేపించారు.
మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేపీఎస్‌లపై మంచి అభిప్రాయం ఉందని, ఆ పేరు చెడగొట్టుకోవద్దని ఎర్రబెల్లి సూచించారు. ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పని అన్నారు. జేపీఎస్‌లు సమ్మె విరమిస్తే... ముఖ్యమంత్రి తప్పకుండా సాయం చేస్తారన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికైనా వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం నోటీసులు.. సమ్మె చేస్తోన్న 9వేల 350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. మే తొమ్మిదో తారీఖు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటీసులు జారీ చేసింది. లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. అయినప్పటికీ నోటీసులను ఖాతరు చేయకుండా జేపీఎస్‌లు సమ్మె చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు లేఖ..: పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే దారుణంగా తయారైందని విమర్శించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు జూనియర్ కార్యదర్శుల కష్టంతోనే వచ్చాయని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.
ఇవీ చదవండి: