ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు.. ప్రతి అంశాన్నీ డబ్బుతో ముడిపెట్టకుండా... క్లిష్ట సమయాల్లో పేదల ప్రాణాలు కాపాడేందుకు సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నా... కార్పొరేట్ ఆస్పత్రులు నిరుపేదలకు అండగా ఉండాలని కోరారు. జాతీయ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకుని... హైదరాబాద్ విన్ ఆస్పత్రిలో మంత్రి ఈటల కరోనా టీకా కేంద్రాన్ని ప్రారంభించారు. వెయ్యి మందికి కరోనా టీకా ఉచితంగా ఇచ్చినందుకు మంత్రి ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం పేదల కోసం ఏర్పాటుచేసిన ఉచిత అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు.
హెల్త్ హబ్
హైదరాబాద్ హెల్త్ హబ్‌గా మారిందన్న మంత్రి... మెరుగైన సేవలు అందించేందుకు వైద్యరంగంపై ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడమే ధ్యేయంగా కార్పొరేట్ ఆస్పత్రులు పనిచేయాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వాస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రులూ అత్యుత్తమ సేవలు అందించాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ దయానంద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి: రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్