జీఎంఆర్, ఎయిర్‌బస్ గ్రూప్ సంస్థల మధ్య ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌లపై అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రధానంగా విమానయాన సేవలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలలో అవకాశాలను అన్వేషించేందుకు ప్రముఖ విమానాశ్రయ ఆపరేటర్, ఏవియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ జీఎంఆర్ గ్రూప్, నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌తో అవగాహన ఒప్పందం కుదర్చుకున్నట్లు జీఎంఆర్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
బెంగళూరు ఏరో ఇండియా- 2021లో ఈ అవగాహన ఒప్పందంపై రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. నిర్వహణ, విడి భాగాల తయారీ, శిక్షణ, డిజిటల్, విమానాశ్రయ సేవలతో సహా పలు విమానయాన సేవలు, వ్యూహాత్మక రంగాలలో అవకాశాలను అన్వేషించేందుకు జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌బస్ సంస్థలు కలిసి పనిచేస్తాయని వివరించింది.
దేశంలోని ఏరోస్పేస్ పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడానికి, వాణిజ్య, సైనిక విమానాల కోసం విస్తృత విమానయాన సేవలను అన్వేషించడానికి రెండు సంస్థలు పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విమానాశ్రయాల ఆపరేటర్లలో ఒకటిగా తాము ఎయిర్‌బస్ సంస్థతో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని జీఎంఆర్, సీఈవో ఎస్.జి.కె కిషోర్ తెలిపారు.
ఇదీ చదవండి: సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి: సీపీ అంజనీకుమార్