జన్యుపరమైన సమస్యలతో వచ్చే తలసేమియా వ్యాధి.. చిన్నారుల్లో సరైన మోతాదులో ఎర్ర రక్త కణాలు లేకపోవటం, హిమోగ్లోబిన్ తగ్గి శరీరంలో ఆక్సిజన్ శాతం పడిపోవటం వంటి సమస్యలకు కారణమై, చివరకు వారి ప్రాణాలను హరిస్తోంది. దేశంలో ఏటా సుమారు 12 వేల మంది చిన్నారులు ఈ రకమైన వ్యాధితో జన్మిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వారిని కాపాడేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం రక్తమార్పిడి.
గాంధీ జయంతి సందర్భంగా..
తలసేమియాతో బాధపడే వారిలో పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి 10 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు సైతం రక్త నిల్వలను సిద్ధం చేసి బాధితులకు అందిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. కరోనా కారణంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రక్తదానానికి ముందుకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సంయుక్తంగా అక్టోబర్ 2న మెగా బ్లడ్ క్యాంప్‌కి పిలుపునిచ్చాయి.
ప్రతి నెలా 120 మందికి పైగా..
తలసేమియా రోగుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. ఎన్ట్ఆర్ ట్రస్ట్ భవన్లో రక్తం కోసం వంద మంది తలసేమియా రోగులు శాశ్వతంగా సభ్యులు కాగా.. ఎప్పటికప్పుడు తమకు రక్తం కావాలని వచ్చే వారికి సైతం రక్తాన్ని అందిస్తున్నారు. ఇలా ప్రతినెలా సుమారు 120 మందికి పైగా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు రక్తాన్ని అందిస్తున్నారు.
రక్త నిల్వలు పెంచడం కోసం..
కరోనా కారణంగా రక్తదానం చేసే వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల గత నెలలో కేవలం 84 మందికే రక్తం అందించారు. ఈ క్రమంలో తలసేమియా బాధితులకు తగినన్ని రక్త నిల్వలు ఉండటం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ తెలుగు యువతతో కలిసి గాంధీ జయంతి సందర్భంగా రేపు ఈ మెగా బ్లడ్ క్యాంపుకి శ్రీకారం చుట్టారు.
అభిమానులకు పిలుపు..
శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలుగు యువత సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేయనున్న ఈ రక్తదాన శిబిరంలో యువత, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయాలని నటులు నందమూరి బాలకృష్ణ, నారా రోహిత్‌లు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి ముమైత్‌ఖాన్