Mars Group Investments in Telangana : పెంపుడు జంతువులకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల సంస్థ మార్స్ గ్రూప్.. రాష్ట్రంలో రూ.800 కోట్లతో (Mars Group Announces 800 Crore Investment) విస్తరణ కార్యకలాపాలను ప్రకటించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో (Minister KTR America Tour).. మార్స్ సంస్థ చీఫ్ డేటా అండ్ అనలటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. తమ విస్తరణ ప్రణాళికలు, నూతన పెట్టుబడి గురించిన వివరాలను వారు కేటీఆర్‌కు తెలియజేశారు.
తెలంగాణలో తమ కార్యకలాపాలు, అనుభవాలను కేటీఆర్ వివరించారు. వీటి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన బృందం.. సిద్దిపేటలో ఉన్న పెంపుడు జంతువుల ఫుడ్ తయారీ ప్లాంట్ ద్వారా పెద్ద ఎత్తున కార్యకలాపాలను ఇప్పటికే నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.200 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించి.. తర్వాత రూ.500 కోట్లకు పెంచినట్లు పేర్కొంది. రాష్ట్రంలో తమ కార్యకలాపాల అనుభవాలు, పెట్టుబడి స్నేహపూర్వక వాతావరణం.. ప్రభుత్వ విధానాల వంటి సానుకూల కారణాల కారణంగా మరో రూ.800 కోట్ల పెట్టుబడి విస్తరణ ప్రణాళికలను మార్స్ సంస్థ ప్రకటించింది.
భారతదేశంలో తమ సంస్థ ఉత్పత్తులకు అద్భుతమైన స్పందన వస్తోందని మార్స్ సంస్థ బృందం తెలిపింది. పెట్‌కేర్, పెట్ ఆహార ఉత్పత్తుల డిమాండ్ మరింత పెరుగుతుందన్న ఆలోచనలకు అనుగుణంగా.. తెలంగాణ కేంద్రంగా సంస్థలను మరింతగా విస్తరించనున్నట్లు పేర్కొంది. కేవలం ఉత్పత్తి తయారీ ప్లాంట్ విస్తరణ మాత్రమే కాకుండా.. ఆర్‌అండ్‌డీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అగ్రికల్చర్ సప్లై చైన్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ వంటి వివిధ రంగాల్లో విస్తరణకు ఉన్న అవకాశాలపై కేటీఆర్‌తో జరిగిన ఈ సమావేశంలో మార్స్ బృందం చర్చించింది.
మార్స్ గ్రూప్ పెట్టుబడిని మరింతగా విస్తరించడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త కంపెనీల పెట్టుబడులు రావడాన్ని ఎంత ముఖ్యమైన అంశంగా భావిస్తామో.. ఇక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు విస్తరించాలన్నది తమ ఆలోచనగా ఉందని తెలిపారు. తెలంగాణ కేంద్రంగా సాగుతున్న అనేక కంపెనీలు.. పెద్దఎత్తున తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఒక కంపెనీ తాను కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో.. తిరిగి పెట్టుబడులు పెట్టడం అంటే ఆ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి సూచికని కేటీఆర్ పేర్కొన్నారు. భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి విస్తరిస్తున్న మార్స్ గ్రూప్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కేవలం రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ.. రూ.1500 కోట్ల స్థాయికి చేరిందని అన్నారు. ఇది రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతను వివరిస్తుందని చెప్పారు. భవిష్యత్‌లోనూ సంస్థ మరింతగా తెలంగాణ కేంద్రంగా విస్తరిస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.
KTR On Sultanpur Medical Devices Park : 'మెడ్‌టెక్ రంగంలో మరో మైలురాయిని తెలంగాణ అధిగమించింది'