Police Issues Notice to MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న ముంబయి ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నోటీసులు జారీ చేసినట్లు మంగళ్‌హాట్ పోలీసులు తెలిపారు. ఆ ర్యాలీలో రాజాసింగ్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. హైకోర్టు షరతులు ఉల్లంఘించినందునే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు.
జైలుకు పంపినా భయపడేది లేదు: వీటిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పారు. తనకు మరోసారి నోటీసులు రావడం పట్ల ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని అన్నారు. నిజాం పాలనకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. పోలీసులు తనను జైలుకు పంపినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. గోహత్య, మత మార్పిడి, లవ్ జిహాద్‌పై చట్టం తీసుకురావాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
'రెండు సార్లు ఎమ్మెల్యే అయినా, మంచి జీవితం చూసుకున్నా. ఇప్పుడు నాది ఒక్కటే ఒక్కటి లక్ష్యం. ధర్మం గురించి చావాలి. ధర్మం గురించి బతకాలి. మీరు జైలుకి పంపిస్తారా, ఏం చేస్తారో చూద్దాం. నేను రెడీ ఉన్నా'. -రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఇదివారికే కొన్ని కేసులు నమోదు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఇంతకుముందుకే ఓ కేసు నమోదైంది. తన ట్విటర్ ఖాతాలో అయోధ్యపై రాజాసింగ్ చేసిన వివాదాస్పద పోస్టుపై సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పీడీ యాక్ట్ కొట్టేస్తూ హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు రాజాసింగ్ తరఫు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు.
సంజాయిషీలో పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా లేవని పోలీసులు పేర్కొన్నారు. 295-ఏ ఐపీసీ సెక్షన్ కింద మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేయడంపై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీ మసీదుపై ఒవైసీ సోదరులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న రాజాసింగ్.. వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, ఒవైసీ సోదరుల మెప్పు పొందేందుకు.. పోలీసులు పోటీపడి తనపై కేసులు నమోదు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.
ఇవీ చదవండి: