పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఒక రాష్ట్రానికే పరిమితం చేయొద్దని, దాన్ని విడదీయకుండా యావత్ తెలుగు జాతి సంస్థగా ఉంచాలని ఏపీ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కోరారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలిగా నియమితులైన ప్రముఖ నాట్యగురువు నిర్మలాప్రభాకర్ అభినందన సభను శనివారం యువకళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించారు.
ఉభయ రాష్ట్రాలకే కాకుండా ఇతర ప్రాంతాల్లోని తెలుగువారందరి సంస్థగా ఉన్నది తెలుగు విశ్వవిద్యాలయం ఒక్కటే అని, దాన్ని విడదీయడం తగదని మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ సంగీతం, సాహిత్యం, నృత్యం, లలితకళల బాధ్యతల్ని తెలుగు వర్సిటీకి అప్పగించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్, రామచంద్రమూర్తి, నిర్మల, మహ్మద్ రఫీ, వెంకట్‌రెడ్డి, భోగరాజు, డా.కోట్ల హనుమంతరావు, డా.వనజా ఉదయ్, డా.రెడ్డి శ్యామల, విజయకుమార్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : న్యాయవాద దంపతుల హత్య కేసులో అనుమానాలెన్నో...!