రాష్ట్రంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ తీరు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిలను వివరిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానాలను అనుసరించలేదని ఆ లేఖలో రేవంత్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో కొవిడ్ రోగుల సంఖ్య భారీగా పెరుగుతోందని.. పరిస్థితి ఆందోళన కరంగా మారిందని వివరించారు. కొవిడ్ నివారణ చర్యల పర్యవేక్షణకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో 27 శాతం..
రాష్ట్రంలో పాజిటివ్ కేసుల రేటు దేశంలోనే అత్యధికంగా ఉందని అన్నారు. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల రేటు 22 శాతం ఉండగా..అదే తెలంగాణలో 27 శాతంగా ఉందని వివరించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ హైదరాబాద్ నగరం ఒక హాట్ స్పాట్‌గా మారుతోందన్నారు. కరోనా వైద్యం అందించే ఆస్పత్రుల్లో సౌర్యాల కొరత ఉందని, అందువల్ల రోగులు చనిపోతున్నారని వివరించారు. కరోనా పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మూడు, నాలుగు రోజుల వరకు ఫలితాలు ఇవ్వడం లేదని తద్వారా జరుగుతున్న అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఊపిరి ఆడడం లేదని
ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక జర్నలిస్టు మనోజ్ మరణించారని, ఛాతి ఆస్పత్రిలో రవి అనే యువకుడు ఊపిరి ఆడడం లేదని పేర్కొంటూ వీడియో చేసి చనిపోయిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. మెట్రో నగరమైన హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు మెడికల్ కాళాశాలలున్నప్పటికీ కరోనాపై జరుగుతున్న పోరులో వాటిని వాడుకోవటం లేదని ఆరోపించారు. అవన్నీ అధికార తెరాస పార్టీకి చెందిన వారివి కావడంతో వల్లనే వాటిని ఉపయోగించకోవటం లేదని ఫిర్యాదు చేశారు.
విరాళాలపై దర్యాప్తు చేయాలి
కార్పొరేటు ఆస్పత్రుల్లో చేరి వైద్యం పొందలేని నిరుపేదలకు క్వారంటైన్ చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి మందులు, పరికరాల కొనుగోళ్ల కోసం భారీగా వచ్చిన విరాళాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ బృందాన్ని హైదరాబాద్‌కు పంపించి సీఎం సహాయనిధికి వచ్చిన విరాళాలపై విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి కేంద్ర వైద్య బృందాన్ని వెంటనే హైదరాబాద్‌కు పంపాలని విజ్ఞప్తి చేశారు. తాను పేర్కొన్న అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని తెలిపారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు