రాష్ట్రానికి నీటి కరవు ముంచుకొస్తోంది. జూన్‌లోనే పలుకరించిన తొలకరి ఇంతవరకు జాడలేదు. దీనికితోడు ఉష్ణోగ్రతల తీవ్రతకు నీటి వినియోగం పెరిగిపోయింది. గత కొన్నిసంవత్సరాల నుంచి అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదుకాకపోవటం, ఇంకుడుగుంతలపై అశ్రద్ధతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంవత్సరం కూడా సాధారణ వర్షపాతం నమోదుకాకపోతే ఉన్నబోర్లు అన్ని ఎండిపోయే పరిస్థితి ఏర్పడటం ఖాయమని... ఇటీవలే భూగర్భ జల వనరుల శాఖ ఓ నివేదికను విడుదల చేసింది.
నివేదికలో ప్రమాద ఘంటికలు..
గతేడాది మేతో పోలిస్తే 2019 మే వరకు 1.83 మీటర్ల నీటి స్థాయిలు పడిపోయినట్లు రాష్ట్ర భూగర్భజలాల విభాగం తెలిపింది. 2018 మేలో 12.73 మీటర్ల లోతున నీరుండగా.. ఈ సంవత్సరం అది 14.56 మీటర్ల లోతుకు పడిపోయింది. కనిష్ఠంగా వాటర్ లెవల్ కుమురంభీం జిల్లా సిర్పూర్ మండలంలో 0.13 మీటర్ల అడుగున నీటి లభ్యత ఉండగా.. గరిష్ఠంగా 54.24 మీటర్ల లోతులో నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో గుర్తించారు. రాష్ట్రంలోని 28.5 శాతం భూభాగంలో 5 నుంచి 10 మీటర్ల లోతులో, 20 శాతం భూభాగంలో 20 మీటర్ల లోతులో నీటి జాడలున్నట్లు తెలిపింది.
182మండలాల్లో పడిపోయిన నీటి నిల్వలు..
2018 మే నెలతో పోలిస్తే 182 మండలాల్లో నీటి నిల్వలు పడిపోయాయని నివేదిక హెచ్చరించింది. ఈ క్షీణత సరాసరి 2.05 మీటర్లుగా ఉంది. రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో నీటి లభ్యతలో 0.06 నుంచి 0.98 పెరుగుదల నమోదవగా.. మిగిలిన ప్రాంతాల్లో 0.07 నుంచి 5.94 మీటర్ల లోతుకు పడిపోయాయని ఈ నివేదిక పేర్కొంది.
సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ఇక అంతే..
నీటి నిల్వలు పెంచేందుకు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, చెట్లను పెంచాలని.. బిందు సేద్యం, తుంపర సేద్యం వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నివేదిక సూచించింది. సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రజలు నీటి ఎద్దడితో కటకటలాడే పరిస్థితులు తప్పవని హెచ్చరించింది.
ఇవీచూడండి: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు శుభవార్త