రాష్ట్రంలో కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదివారం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి తాజా పరిస్థితులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన వారు 100శాతం కోలుకున్నారని....64 మంది డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లారని ముఖ్యమంత్రి తెలిపారు.
సడలింపులుండవ్..
లాక్‌డౌన్‌లో ఎటువంటి సడలింపులు ఉండబోవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మే 1 వరకూ కొత్త కేసులు వచ్చే అవకాశం ఉన్నందున.. లాక్‌డౌన్ యథాతథంగా అమలు చేస్తామని తెలిపారు. కేంద్రం సడలింపులు సూచించిన నేపథ్యంలో తాము అనేక సర్వేలు చేయించామని... అందరూ లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారని ముఖ్యమంత్రి వివరించారు. మే 7 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
స్విగ్గీ, జొమాటో సేవలు రద్దు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఫుడ్ డెలివరీ ప్రమాదకరమన్న ముఖ్యమంత్రి స్విగ్గీ, జొమాటో వంటి సేవలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిత్యావసర సరుకుల సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు.
అనుమతులుండవు..
విదేశాల్లో విమాన సర్వీసులు ప్రారంభమైనా.. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావొద్దని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సామూహిక ప్రార్థనలు, పండగలకు అనుమతులు ఉండవని.. మతాలకతీతంగా అందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
కిమ్స్‌కు ధీటుగా టిమ్స్..
వైద్యుల సేవలకు మరోసారి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్... గచ్చిబౌలి స్టేడియంను వైద్యశాఖకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అవసరమైతే 1,500 పడకలతో కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా వినియోగిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్-టిమ్స్ పేరుతో కిమ్స్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు అతిక్రమించవద్దని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది