తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఈమెయిల్ ద్వారా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ధర్మాసనం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు కానీ.. అక్కడ సరైన సదుపాయాలను కల్పించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ కిట్లు, మాస్కులు తగినన్ని లేకపోవడం వల్ల వారికి ప్రమాదం పొంచి ఉందన్నారు.
శానిటైజర్లు, మాస్కులు, డయోగ్నటైజ్ కిట్లు, వెంటిలేటర్లు తగినన్ని లేవని... వాటి ఉత్పత్తికి, దిగుమతికి తగు చర్యలు చేపట్టడం లేదని న్యాయవాది.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. లాక్డౌన్ కొనసాగుతున్నందున ప్రజలకు నిత్యవసర వస్తువులు, ఔషధాలు తగిన ధరలో ఇంటి వద్దకే చేర్చేలా చేయలేదన్నారు. తెల్ల రేషన్ కార్డులు లేని అసంఘటిత కార్మికులు, అనాథలు, యాచకులు, హాస్టల్ విద్యార్థులు కనీస నిత్యావసరాలు అందక ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.
వాదనలు విన్న ధర్మాసనం ప్రజలకు, క్వారంటైన్లో ఉన్నవారికి ఎలాంటి సదుపాయాలు కల్పించారు.. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లు అందుబాటులో ఉన్నాయా.. ప్రజలకు నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉండేందుకు ఏం చర్యలు చేపట్టారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.