కిలోమీటర్ల మేర బారులు తీరే వాహనాలు. రణగొణ ధ్వనులు. ట్రాఫిక్‌లో ఇక్కుకున్నామా.. వాహనం కదిలి ముందుకు వెళ్లాలంటే నిమిషాల తరబడి వేచిచూసే పరిస్థితి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో రహదారులపై కనిపించే దృశ్యాలివి. కానీ లాక్డౌన్ కారణంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితులు, నిత్యవసర సరకుల కోసం మాత్రమే బయటికి రావాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఉల్లంఘంచి బయటికి వస్తే పోలీసులు జరిమానా విధిస్తున్నారు.
ఆ ముడింటి పరిధిలో 250కి పైగా తనిఖీ కేంద్రాలు...
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 250కి పైగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాహనదారులు ఒక తనిఖీ కేంద్రాన్ని తప్పించుకొని ముందుకు పోయినా... మరో తనిఖీ కేంద్రం వద్ద పోలీసులకు దొరికిపోవాల్సిందే. ఈ తరుణంలో వాహనదారులు బయటికి రాకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఒకవేళ బయటికి వచ్చిన పోలీసులకు దొరికిపోతున్నారు. ఇలా మూడు కమిషనరేట్లలో పరిధిలో లాక్ డౌన్ సమయంలో సుమారు 15లక్షల మంది వాహనదారులకు పోలీసులు జరిమానా విధించారు. లక్షన్నరకు పైగా వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా ప్రజలు రోడ్డెక్కడం దాదాపు మానేశారు. వాహనాల రాకపోకలు భారీగా తగ్గిపోవడంతో ప్రమాదాలు సైతం తగ్గాయి.
లాక్డౌన్ వల్ల గణనీయంగా తగ్గిన ప్రమాదాలు !
రాష్ట్రంలోని ప్రమాదాల్లో 35 శాతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే జరుగుతాయి. ప్రమాదాల నివారణకు గత మూడేళ్లుగా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి.... ఆయా ప్రాంతాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఫలితంగా ప్రమాదాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోయాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నాలుగు నెలలకు గాను ఏప్రిల్ మాసంలో తక్కువ ప్రమాదాలు నమోదయ్యాయి.
లాక్డౌన్ కారణంగా రహదారులన్నీ నిర్మానుష్యం.
జనవరిలో 237 ప్రమాదాలు జరగ్గా.. 248 మంది గాయపడ్డారు. అందులో 24 మంది మృత్యువాత పడ్డారు. ఫిబ్రవరిలో జరిగిన 222 ఘటనల్లో 240 మంది గాయపడ్డారు. 16 మంది చనిపోయారు. మార్చిలో 179 ప్రమాదాల్లో 191 మంది గాయపడగా.. 15 మంది మరణించారు. ఏప్రిల్‌లో కేవలం 48 ప్రమాదాలే జరిగాయి. ఇందులో 52 మంది గాయపడగా, ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదాలు కూడా ఎలా జరిగాయనే దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. లాక్డౌన్ కారణంగా రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉండటం.. కూడళ్ల వద్ద సిగ్నళ్లు లేకపోవడం ఫలితంగా.. ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల కుక్కలు అడ్డంగా వచ్చి ద్విచక్రవాహనదారులు కిందపడి గాయాలపాలవుతునట్లు తెలిపారు.
మద్యం దుకాణాల వల్ల మళ్లీ రోడ్డు ప్రమాదాలు !
ప్రభుత్వం లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వడం వల్ల వాహనాల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం వల్ల నగరంలో రెండు మూడు చోట్ల మద్యం మత్తులో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అప్రమత్తమైన అధికారులు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.