భవన నిర్మాణ కార్మికుడొకరు లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు. అన్‌లాక్ సమయంలో మద్యం తాగుతూ, జూదమాడుతూ భార్య నగలు అమ్మేశాడు. ఆమె పేరిట ఉన్న కొద్దిపాటి పొలం విక్రయించమని ఒత్తిడి చేస్తున్నాడు. పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తే ఇద్దరికీ నచ్చజెప్పారు. రెండ్రోజుల తరవాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. భరించలేక భార్యా, పిల్లలు ఓ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందారు.
దంపతులిద్దరూ ఉద్యోగులు. అకస్మాత్తుగా భర్త ఉద్యోగం పోయింది. ఆ కోపాన్ని కుటుంబ సభ్యులపై ప్రదర్శించసాగాడు. ఆనందంగా సాగుతున్న కాపురంలో కలతలు తారస్థాయికి చేరాయి. రోజువారీ ఖర్చులకు భార్యపై ఆధారపడటాన్ని నామోషీగా భావించి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని కాపాడి సైకాలజిస్టుతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.
ఆలుమగల మధ్య గిల్లికజ్జాలు..
చిలిపి తగాదాలు సహజమే. భరించలేనంత ఇబ్బందిగా మారితేనే కాపురం నరకప్రాయం అవుతుందంటున్నారు సైకాలజిస్టులు. నగరవ్యాప్తంగా కరోనా విజృంభణతో పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల సేవలకు విఘాతం ఏర్పడింది. కొన్ని పోలీసు ఠాణాల్లో అత్యవసరమైన ఫిర్యాదులు డయల్ 100 ద్వారా చేయాలంటూ పోస్టర్లు అంటించారు. గొడవ పడుతున్న దంపతులకు సర్దిచెప్పేందుకు టోల్‌ఫ్రీ నంబరుతో కౌన్సెలింగ్ చేస్తున్నారు. బాధితులు ఠాణాలకు వెళ్లేందుకు వెనుకాడుతుంటే.. దర్యాప్తు కోసం బయటకు వెళ్లేందుకు పోలీసులూ ఆచితూచి అడుగేస్తున్నారు. ఈ ప్రతికూల వాతావరణంలో, గృహహింసను సైతం మహిళలు మౌనంగా భరించాల్సి వస్తోంది. చేసేదిలేక స్వచ్ఛంద సంస్థల టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి బాధను చెప్పుకొంటున్నారు.
ఏటా వందలాది కేసులు
నగరంలో ఏటా వందల సంఖ్యలో గృహహింస కేసులు నమోదవుతున్నాయి. మూడు, నాలుగు దఫాలు కౌన్సెలింగ్ ఇచ్చి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికీ విడిపోవాలనుకుంటే తదుపరి చర్యలు చేపడతారు. రెండు, మూడు నెలలపాటు జరిగే ఈ ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయింది. గృహహింస భరించలేనిదిగా మారినపుడు మహిళలు 108, 100 నంబర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. విడిగా ఉండాలనుకొనేవారిని సఖి కేంద్రం ఆధ్వర్యంలో నడిచే సంరక్షణ కేంద్రాలకు పంపుతున్నారు. లాక్‌డౌన్ వేళ పనిభారం, మానసిక ఒత్తిడి, శారీరక హింసను తట్టుకోలేక స్వచ్ఛంద సంస్థల సాయం పొందిన మహిళలున్నారు. కుంగుబాటుకు గురైన గృహిణులు కొందరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారని, వారికి ఫోన్‌లోనే కౌన్సెలింగ్ ఇచ్చి మనోధైర్యం నింపుతున్నట్టు రోష్నీ ప్రతినిధులు తెలిపారు.
నగరంలో నమోదైన కేసుల వివరాలు
సంవత్సరం | గృహహింస కేసులు |
2018 | 800-820 |
2019 | 1000కి పైనే |
సాయం కోసం రోష్నీ టోల్‌ఫ్రీ నంబరును సంప్రదిస్తున్న మహిళల సంఖ్య 20-30 శాతం పెరిగింది.