మహానగర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మించనున్న కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. రూ.4,777 కోట్లతో 5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నగర శివారు మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ వద్ద భారీ జలాశయం నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు 1501.13 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో 820.07 ఎకరాలు అటవీ భూమి ఉండటంతో జలమండలి.. కేంద్ర అటవీ శాఖ అనుమతులను కోరింది. భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో లేఖ రాయగా కేంద్ర అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెళ్లారు. ఈ భూములకు ప్రత్యామ్నాయంగా సిద్దిపేట, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో అటవీ భూములు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తాజాగా ప్రాథమిక అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర అటవీ శాఖ నిర్ణయించడంతో రిజర్వాయర్ నిర్మాణానికి దాదాపు ఆటంకం తొలగినట్లేనని అధికారులు అంటున్నారు. కేంద్రం సూచించిన నిబంధనలు, పరిహారం చెల్లిస్తే తదుపరి అనుమతులు మంజూరు కానున్నాయి.
భాగ్యనగర నీటి అవసరాలకు భరోసా
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి పంపింగ్ చేసి ఆ నీటిని కేశవాపూర్ రిజర్వాయర్‌లో నింపుతారు. భూసేకరణ, పనుల్లో జాప్యం, ఇతరత్రా కారణాలతో పనులు ముందుకు కదల్లేదు. అటవీ శాఖ అనుమతులు రానుండటంతో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కొండంత అండ దొరికింది. ఈ రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చేలోపు కొండపోచమ్మ సాగర్ నుంచి నేరుగా అవుటర్ రింగ్‌రోడ్ రింగ్ మెయిన్‌కు పైపులైన్ అనుసంధానం చేసి నగరానికి నీటిని అందించేలా ఇప్పటికే అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇవీచూడండి: రాజధానిలో కరోనా కేసుల తగ్గుముఖం... నగరవాసుల్లో ఆనందం