కేంద్రంలో ప్రతిపక్షం లేకుండా చేసి... ఏకపక్షంగా భాజపా ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదించిందని రాష్ట్ర వామపక్ష నేతలు మండిపడ్డారు. ఈ చట్టాలు రైతులకు నష్టం చేయడమే కాకుండా, ఆహారభద్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని రద్దు చేయాలని కోరుతూ గత 65 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో సైతం... రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా కేంద్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యహరిస్తోందని అన్నారు.
జనవరి 26న లక్షలాది మంది రైతులు దిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపడుతే... ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసి తప్పుదోవపట్టించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు. రైతులపై టీయర్‌గ్యాస్, లాఠీఛార్జీ, కాల్పులకు భాజపా ప్రభుత్వం పూనుకుందన్నారు. రైతు నేతలపై అల్లర్లు, విధ్వంసం, హత్యాయత్నం, నేరపూరితకుట్ర తదితర సెక్షన్లతో అక్రమ కేసులను పెట్టిందని విమర్శించారు.
ర్యాలీలో భాజపాకి చెందిన అసాంఘిక శక్తులు చొరబడి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రకోటపై జెండా ఎగురవేసింది కూడా భాజపా మద్దతుదారుడేనని తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న రైతులను ఉరితీయాలని భాజపా ఎంఎల్‌ఏ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కేంద్రమే ఈ హింసాత్మక ఘటనలకు పాల్పడి రైతులపై రుద్దాలని చూస్తున్నదన్నారు. అయినప్పటికీ రైతులు భయపడకుండా ఈ నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు ఉద్యమాన్ని ఆపబోమని ప్రకటించడం గొప్ప విషయం అన్నారు. వారిపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేసి, జనవరి 26న దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల వెనక అసలు కుట్రదారులెవరో... విచారణ జరపాలని వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇప్పటికైనా నరేంద్రమోదీ ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఈ నల్ల చట్టాలపై రైతు సంఘాలతో చర్చించి, వాటిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: యూపీలో కిసాన్ మహాపంచాయత్- వేల మంది హాజరు