Pil on paddy procurement in HC: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎఫ్సీఐని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తామని ఎఫ్సీఐతో ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది అభినవ్ కృష్ణ వాదించారు. కానీ ప్రభుత్వం ధాన్యం సేకరించక పోవడంతో... కొనుగోలు కేంద్రాల్లో లక్షల టన్నుల ధాన్యం పేరుకుపోయిందని.. రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు.
విచారణ వాయిదా
పంట నష్టపోయి కొందరు రైతులు మరణించినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎఫ్సీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం వివరాలు తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్సీఐలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. విచారణను డిసెంబరు 6కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Krishna Tribunal Hearing in SC: '48 గంటల్లోపు అఫిడవిట్ దాఖలు చేయండి'