మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. సర్కారు అధికారిక లాంఛనాలతో జరిగిన అంతిమ సంస్కారాల్లో... పలువురు మంత్రులు, తెరాస శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. ఆత్మీయ నేతకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరైన మంత్రి కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్.. నాయిని పాడె మోసి నివాళి అర్పించారు.
హాజరైన మంత్రులు
అంత్యక్రియల్లో భాగంగా... పోలీసులు గాల్లోకి మూడుసార్లు కాల్పులు జరిపి మాజీ హోంమంత్రికి నివాళులు అర్పించారు. నాయిని అంత్యక్రియలకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ నేత కె.కేశవరావు, మంత్రులు కేటీఆర్, ఈటల, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి, మండలి చీఫ్‌విప్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. నాయిని నర్సింహారెడ్డి సతీమణి గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. భర్తను కడసారి చూసేందుకు ఆమె వీల్‌చైర్‌లోనే మహాప్రస్థానానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. భర్తను తలుచుకుంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
అభిమాన నేతకు నివాళి
అంతకుముందు... మంత్రుల నివాస సముదాయం నుంచి ప్రారంభమైన నాయిని అంతిమయాత్ర... బంజారాహిల్స్ రోడ్ నంబరు 12, ఫిలింనగర్ మీదుగా సాగింది. సహచరులు, పార్టీ శ్రేణులు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని అభిమాన నేతకు నివాళి అర్పించారు.
కరోనాను జయించిన జననేత
కరోనా సోకినా ధైర్యంగా పోరాడి జయించిన నాయిని అనంతరం తీవ్రమైన లంగ్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల అనారోగ్యం పాలయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి 12 గంటల 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
ఇవీ చూడండి: ఉద్యమ నేతకు కన్నీటి నివాళ్లు... నర్సన్నకు అంతిమ వీడ్కోలు