సాంకేతిక యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ కె.వి. రమణాచారి పేర్కొన్నారు. ప్రత్యక్షంగా పూజారి లేకపోయినా.. అన్ని పూజా కార్యక్రమాలు శాస్త్రీయంగా నిర్వహించేలా రూపొందించిన బ్రహ్మాస్మి వైబ్‌సైట్‌ను హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులను గుర్తించి.. వారి సంక్షేమం కోసం పరిషత్ ఏర్పాటు చేశారని రమణాచారి పేర్కొన్నారు. రూ.100 కోట్లు కేటాయించి బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించారని తెలిపారు. శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ హిందూ మత పూజా కార్యక్రమాలను అందించేందుకు ఏర్పాటు చేసిన ఆధునిక వేద పండితుల సమూహాల సమ్మేళనమే బ్రహ్మాస్మి అని వక్తలు అభిప్రాయపడ్డారు.
వేద పండితులను, పురోహితులను, బ్రాహ్మణులను గౌరవించడం మన భారతీయ సాంప్రదాయమని పేర్కొన్నారు. బ్రాహ్మణ ఐక్యతను చాటాలని.. ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. హిందూ మత సాంప్రదాయల ప్రకారం బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించడంతోపాటు వారు ఆత్మగౌరవంతో జీవించే విధంగా చేయాలనే లక్ష్యంగా ముందుకు పోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో రమణాచారితోపాటు మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, ఎమ్మెల్సీ రాంచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అమిత్‌షాతో కేసీఆర్ భేటీ... విపత్తు నిధుల సాయంపై చర్చ