KTR tour in Kukatpally: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు పూర్తయిన వాటిని ప్రారంభించారు. కాలనీల్లో కలివిడిగా తిరిగిన మంత్రి ఉల్లాసంగా గడిపారు. ప్రధాన కూడళ్లలో కాబోయే ముఖ్యమంత్రి అంటూ స్థానిక నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. 28 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి 19వ వార్డులో రూ.4.50 కోట్లతో చేపట్టే చెరువు రిటైనింగ్ వాల్, మానస సరోవర్ నాలా, టీ జంక్షన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న స్టార్మ్ వాటర్ నాలా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
దాదాపు రూ.10 కోట్లతో రంగధాముని చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. మూసాపేట్ బాలాజీ నగర్‌లో రూ.2 కోట్లతో చేపట్టబోయే పార్కు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.2 కోట్లతో బాలాజీ నగర్‌లో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును కేటీఆర్ ప్రారంభించారు. కేపీహెచ్బీ 14వ వార్డులో రూ. మూడున్నర కోట్లతో చేపట్టిన హిందూ శ్మశాన వాటికను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మంత్రి వెంట మేయర్ విజయలక్ష్మి, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. పర్యటనలో కలిసిన పారిశుద్ధ్య కార్మికుల బాగోగులు మంత్రి తెలుసుకున్నారు. ఎవరికైనా సమస‌్యలుంటే ఎమ్మెల్యే కృష్ణారావును కలవమని సూచించారు.
ఆయా డివిజన్ల వద్ద తరలివచ్చిన ప్రజలతో మంత్రి ఉల్లాసంగా గడిపారు. మంత్రితో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడగా.. ఓపిగ్గా అందరితో స్వీయచిత్రాలు తీసుకుని ఆనందపరిచారు. కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్కు స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్కు స్వాగతం అంటూ కొందరు నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: