రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేసినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికోసం సమాచారాన్ని అందుబాటులో ఉంచారని కేటీఆర్ తెలిపారు.
సరళతర వాణిజ్య విధానంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణలో ప్రమోషన్ విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. వెబ్‌సైట్‌లో పెట్టుబడిదారులకు అవసరమైన సంపూర్ణ సమాచారం ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.
ఇప్పటికే వెబ్‌సైట్‌లో పలు సేవలకు సంబంధించిన లైవ్ లింక్‌లను ఉంచామని.. తద్వారా ఆయా సేవలను పెట్టుబడిదారులు నేరుగా వినియోగించుకోవచ్చన్నారు. భవిష్యత్తులో ఈ వెబ్ సైట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ భాషల్లోనూ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!