KTR Fires on Congress Party : కాంగ్రెస్‌పార్టీ దిల్లీలో అదానీతో కొట్లాడుతూ రాష్ట్రంలో మాత్రం ఎందుకు అదానీతో కలిసి పనిచేస్తుందో స్పష్టం చేయాలని మాజీమంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ(BJP) ఆదేశాల మేరకే ఇక్కడి ప్రభుత్వం, అదానీతో(Adani Investments) కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
నాడు నేడు ఎనాడైనా తెలంగాణ గళం, బలం, దళం మేమే : కేటీఆర్
కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు కేటీఆర్(ktr) పిలుపు ఇచ్చారు. బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్‌ఎస్‌ను ఓడించాలని, బొంద పెట్టాలని పిలుపునిస్తున్నారన్నారు. మోదీ - అదానీ ఒక్కటే అని రాహుల్ గాంధీ అంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని - అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు.
13 లక్షల కోట్ల రూపాయలు దోచిన అదానీ, ఆసొమ్మంతా ప్రధానమంత్రికి, బీజేపీకి పోతాయని రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడారని, కానీ ఇవాళ దావోస్ సాక్షిగా అదానితో అలయి బలయి చేసుకుంటున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్‌పార్టీ దిల్లీలో అదానీతో కొట్లాడుతూ రాష్ట్రంలో మాత్రం ఎందుకు అదానీతో కలిసి పనిచేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువు అన్న కాంగ్రెస్ పార్టీ, మరి ఇప్పుడు అదే అదానితో ఎందుకు పనిచేస్తుందో చెప్పాలని కోరారు.
'స్టార్టప్ ర్యాంకింగ్స్లో తెలంగాణకు అగ్రస్థానం - పదేళ్ల పటిష్ఠ ఎకో సిస్టంనకు నిదర్శనం'
KTR Comments on Congress Gurantees : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలన్న ఆయన, పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా మా వల్ల కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసిందని అన్నారు. మహబూబ్‌నగర్ కు పక్కనే ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చిన బీజేపీని నిలదీసే ప్రయత్నం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేయలేదని కేటీఆర్ ఆక్షేపించారు.
ప్రియాంక గాంధీ 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని కానీ, అసెంబ్లీ సాక్షిగా ఉపముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదు అని చెబుతున్నారని అన్నారు. ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలకు భిన్నంగా ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి దశల వారీగా రుణమాఫీ చేస్తామంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు.
ఎరువుల కోసం లైన్‌లో నిలబడి, పోలీస్ స్టేషన్‌లో పెట్టి పంచే పరిస్థితి మళ్ళీ వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోని ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని కేటీఆర్ అన్నారు. అన్ని స్థాయిలో పార్టీ కమిటీలను కొత్తగా వేస్తామని, నిరంతరం అన్ని అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
తాము గెలిచినప్పుడు పొంగిపోలేదని, ఓటమికి కుంగిపోమన్న ఆయన, ఎప్పుడైనా పార్టీ ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోసమే పని చేస్తుందని వివరించారు. అప్పులు కాదు, ఆస్తుల సృష్టించి బంగారు పళ్ళెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పజెప్పామని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గ్రామం నుంచి రాజధాని హైదరాబాద్ వరకు ప్రతి చోటా అనేక వేలకోట్ల ఆస్తులను సృష్టించినట్లు కేటీఆర్ వివరించారు.
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ - ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్