Kishan Reddy Comments on Protem Speaker Selection : అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏ ప్రతిపాదికన అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ చేశారో స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan reddy) పేర్కొన్నారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయరని స్పష్టం చేశారు. కాంగ్రెస్, మజ్లిస్‌కు మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు.
తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపీ : కిషన్‌రెడ్డి
ఈ అంశంపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. స్పీకర్ ఎన్నికను అపాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నికయిన తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా పడిపోతుందని అందుకే మజ్లిస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు.
BJP MLA's absent Assembly Meetings : నూతనంగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిని సన్మానించారు. అనంతరం శాసన సభ సమావేశాలపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నిక కావడంతో ఆయన సమక్షంలో ప్రమాణం చేయవద్దని రాష్ట్ర అధ్యక్షుడు సూచించారు.
'నాగార్జునసాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు'
రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని మొదటగా భావించారు. కానీ అధ్యక్షుడు, సహాచర ఎమ్మెల్యేల నిర్ణయం పట్ల రాజాసింగ్(Raja singh) ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోపంతో వెళ్లిపోయిన రాజాసింగ్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లలేదు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి కిషన్ రెడ్డికి ఫోన్ రావడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు.
ఎమ్మెల్యేలు మాత్రం ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయవద్దని.. ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన కిషన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం లేదని రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు.
"అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏ ప్రతిపాదికన అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ చేశారో స్పష్టం చేయాలి. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయరు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నికయిన తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. కాంగ్రెస్, మజ్లిస్‌కు మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది". - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం - హాజరు కానీ బీజేపీ సభ్యులు