ఇంటి ముందు ఆడుకుంటున్న రెండు సంవత్సరాల బాలుడి అపహరణ కేసును పోలీసులు నాలుగు గంటల్లో ఛేదించారు. మియాపూర్ హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌కు చెందిన అబ్ధుల్ వాహీద్ కుమారుడు ఎండీ ఆస్కాన్ ఇంటి ముందు ఆడుకుంటుండగా... వారి ఇంట్లోనే అద్దెకు ఉండే రాజు అనే వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది.
కొద్దిసేపటికి బాలుడు కనిపించడం లేదనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి... సమీపంలో వెదికారు. ఆచూకీ లభించకపోవడం వల్ల బాధితులు మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి బాలుడిని అపహరించినట్టు గుర్తించారు. మాదాపూర్‌లో ఉన్న రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని బాలుడిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. గతంలో ఇంటి యజమానితో ఉన్న వివాదం కారణంగానే బాలుడిని అపహరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కుమారుడు సురక్షితంగా తల్లి ఒడికి చేరగా.. తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇవీ చూడండి: దిశ తరహా మరో ఘటన.. రంగారెడ్డి జిల్లాలో మహిళ హత్యాచారం