Drugs Case: హైదరాబాద్ పంజాగుట్ట డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముంబయి కేంద్రంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న టోనీని ఐదు రోజులపాటు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. గతంలో టోనీ పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చాడని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఎస్కే పేరుతో స్వయంగా మూడేళ్లు కొకైన్ తీసుకువచ్చి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలీచౌకీ ప్రాంతాల్లో విక్రయించాడని గుర్తించారు. రెండు నెలల్లోనే కోట్ల విలువైన సరకు అమ్మిన్నట్లు అంచనా వేస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై తీసుకొని విచారించనున్నారు.
డబ్బు ఎలా పంపాలని అడిగితే..
భారీస్థాయిలో డ్రగ్స్ విక్రయిస్తున్న టోనీ.. వినియోగదారుల నుంచి నేరుగా డబ్బు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. డబ్బు ఎలా పంపించాలని ఏజెంట్లు ఫోన్ చేస్తే... ఆ సమయంలో తన పరిసరాల్లోని మొబైల్ రీ ఛార్జింగ్, చాయ్ దుకాణాలు, కేఫ్‌లు, చిన్న రెస్టారెంట్ల వద్దకు వెళ్లి ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే నంబర్లు తీసుకుని ఆ ఖాతాల్లోకి నగదు బదిలీ చేయించేవాడని తెలుసుకున్నారు. అనంతరం వారికి కృతజ్ఞతగా వెయ్యి నుంచి 5 వేల వరకు ఇచ్చేవాడని గుర్తించారు. కొకైన్ విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును ముంబయిలోని హవాలా ఏజెంట్ల ద్వారా స్టార్‌భాయ్‌కి పంపించేవాడని గుర్తించారు. వారానికి 15 నుంచి 30 లక్షల వరకు హవాలా ఏజెంట్ల ద్వారా పంపించాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రహస్య ప్రాంతంలో విచారణ..
దక్షిణాఫిక్రాకు చెందిన స్టార్‌భాయ్ నుంచి సరకు తెప్పించుకుంటున్న టోనీ... ముంబయిలోనే 20 మంది ఏజెంట్లను నియమించుకున్నాడని తెలుస్తోంది. ఆరేళ్ల క్రితం స్వయంగా డ్రగ్స్ విక్రయించేందుకు హైదరాబాద్, బెంగళూరు నగరాలకు తరచూ వచ్చేవాడని పోలీసులు పేర్కొన్నారు. 2016 నుంచి 2019 వరకు ప్రతి మూడు నెలలకోసారి హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. 2019లో గోల్కొండ, నాంపల్లి ఎక్సైజ్ పోలీసులకు తన అనుచరులు దొరికిపోవడంతో అప్పటి నుంచి హైదరాబాద్‌కు రాలేదని పేర్కొన్నారు. టోనీ కస్టడీ ముగియటంతో అతడిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో పట్టుబడిన ముగ్గురు టోనీ అనుచరులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
ఇదీచూడండి: Hyderabad Drugs Case: కాల్ డేటా ఆధారంగా టోనీ విచారణ.. రంగంలోకి ఈడీ?