CM KCR Review on Palamuru RangaReddy Lift Scheme: ఆదివారం అట్టహాసంగా ప్రారంభోత్సవం జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో అధికార కార్యకలాపాలు మొదలుకానున్నాయి. నిన్న ప్రారంభోత్సవం జరిగిన వెంటనే సీఎం కేసీఆర్ 6 కీలక దస్త్రాలపై సంతకాలు చేయగా... మంత్రులు కూడా తమ శాఖలకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. అధికారులు కూడా సీఎంను, మంత్రులను అనుసరిస్తూ కొత్త సచివాలయంలో దస్త్రాలపై సంతకాలు చేశారు.
కొత్త సచివాలయంలో సీఎం మొదటి సమీక్ష: ఇప్పటికే నూతన భవనంలోకి శాఖల తరలింపు పూర్తయింది. మిగిలిపోయిన చిన్నచిన్న పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. రోజువారీ కార్యకలాపాలు సాగేందుకు ఎలాంటి ఇబ్బందిలేదని తెలిపాయి. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో మొదటి సమీక్ష నీటిపారుదల శాఖపై ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ఆరా తీయనున్నారు. సచివాలయం కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ సంతకాలు చేసిన 6 దస్త్రాల్లోనూ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రం కూడా ఉంది.
కరివేన, ఉద్దండాపూర్ కాల్వల విస్తరణపై సమీక్షించనున్న సీఎం: ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కరివెన, ఉధండాపూర్ జలాశయాలు మొదలు నారాయణపేట, కొడంగల్, వికారాబాద్ జిల్లాకు వెళ్ళే తాగునీటి కాల్వల నిర్మాణం, వాటి పురోగతి గురించి సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసబర్వాల్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ కుమార్, రామకృష్ణారావు, నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్లు సమీక్షలో పాల్గొంటారు.
కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రజత్ కుమార్ లేఖ: జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు... కొన్నిరోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పుతో ప్రారంభమయ్యాయి. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీల నీటిని తీసుకునేందుకు మాత్రమే పనులు చేసేందుకు అనుమతులు లభించాయి. అనుమతుల కోసం డీపీఆర్ ను కేంద్ర జలసంఘానికి పంపితే నీటి కేటాయింపులు లేవని వెనక్కు వచ్చింది. ఈ పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ విషయమై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రజత్ కుమార్ లేఖ రాశారు. వీటన్నింటి నేపథ్యంలో పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో సమస్యలు, అనుమతులు, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు మేరకు పనుల కొనసాగింపు, భవిష్యత్ కార్యాచరణ, తదితర అంశాలపైనా చర్చించనున్నారు.
ఇవీ చదవండి: