KCR Elected as BRSLP Leader : బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆపార్టీ సభ్యులు ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్ నేత కేశవరావు అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు తెలంగాణ భవన్లో (Telangana Bhavan) సమావేశపై ఈ మేరకు తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. పార్టీ అధినేత కేసీఆర్‌కు శస్త్రచికిత్స జరిగిన కారణంగా ఇవాళ జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. కేసీఆర్‌తో పాటు ఆసుపత్రిలోనే ఉన్న కేటీఆర్ కూడా భేటీకి హాజరు కాలేదు.
కేసీఆర్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
BRS MLAs Elected KCR As BRS LP Leader : సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పేరును బీఆర్ఎస్ఎల్బీ (BRS LP Leader) నేతగా ప్రతిపాదించారు. దాన్ని కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బలపరిచారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యత కేసీఆర్‌కు అప్పగిస్తూ అలాగే బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నుకుంటూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదించారు.
కేసీఆర్‌ను కలిసిన చింతమడక గ్రామస్థులు
అనంతరం ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి బయలు దేరారు. వ్యక్తిగత కారణాల వల్ల ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్ సమావేశానికి హాజరు కాలేదు. అసెంబ్లీకి వెళ్లేముందు మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, మల్లా రెడ్డితో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం అందరూ కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
ఎమ్మెల్యేలుగా గెలిచినందున కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి శాసనమండలి సభ్యులుగా రాజీనామా చేశారు. ముగ్గురి రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఇవాళ అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్, కేటీఆర్, పద్మారావు, ముఠా గోపాల్ ఇవాళ ప్రమాణం చేయలేదు. వీరితో పాటు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి కూడా మరోరోజు ప్రమాణం చేస్తామని అసెంబ్లీ కార్యదర్శిని కోరారు.
సభలో ప్రస్తుతం బీఆర్ఎస్కు 39 సీట్లు ఉండటంతో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించనుంది. ప్రతిపక్ష పాత్రలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తామని గులాబీ బాస్ కేసీఆర్ ఫలితాలు వచ్చిన మరుసటిరోజే ప్రకటించారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని.. ఆ తరువాత వారి వైఫల్యాలను ఎత్తి చూపుతామని తెలిపారు. అనంతరం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. గురువారం అర్థరాత్రి సమయంలో కింద పడటంతో.. ఆయనకు తుంటి శస్త్రచికిత్స అనివార్యమైంది. నిన్న సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు ఇప్పటికే తెలిపారు.