పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లను వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం ఉందని తెరాస సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు సూచించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సురభి వాణీదేవిని గెలిపించాలని కోరారు. బంజారాహిల్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఖైరతాబాద్ డివిజన్‌లోని ప్రతీ పట్టభద్రుడైన ఓటరును కార్యకర్త కలిసి ఓటు వేసేలా కృషి చేయాలని కేకే వివరించారు. జాతీయ-అంతర్జాతీయ అంశాలపై అవగాహన కలిగిన వాణీదేవిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా గ్రూపు మీటింగ్‌లు ఏర్పాటు చేసుకోవాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహిళను బరిలో నిలిపినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవని, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి స్పష్టం చేశారు.
పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలతోనే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తొలిసారిగా ఒక మహిళా ఎమ్మెల్సీని గెలిపించే అవకాశం మనకు లభించిందని దానం పేర్కొన్నారు. ఆమెను గెలిపించడం ద్వారా పీవీని మరింత గౌరవించినవారమవుతామని తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రశ్నించడం కాదు పరిష్కారం చేసి చూపిస్తాం: మంత్రి హరీశ్