మంచి అకడమిక్ ట్రాక్ రికార్డు ఉంటే చాలు.. ఉద్యోగం దానంతటదే వస్తుందనే భావనలో మనలో చాలా మంది ఉంటారు. అయితే మంచి పర్సంటేజ్‌తో పాస్ కావడం ఉద్యోగ వేటలో కొంత వరకే అక్కరకొస్తుంది. ఉద్యోగం సొంతం కావడానికి తెలివితేటలు, ప్రతిభతో పాటు కష్టపడి పనిచేసే తత్వం, చురుగ్గా ఆలోచించే సామర్థ్యం, చొరవ, బాధ్యతలు తీసుకోవడం... లాంటి ఎన్నో అంశాలు ఇంటర్వ్యూల్లో ప్రభావం చూపుతాయి. ఇలా ఉద్యోగానికి అవసరమైన లక్షణాలన్నీ మీలో పుష్కలంగా ఉన్నప్పుడే కొలువు ఖాయమవుతుంది.
చాలాసార్లు అకడమిక్స్‌లో ఎక్కువ మార్కులు పొందినవారి కంటే తక్కువ మార్కులు వచ్చినవాళ్లే వేగంగా ఉద్యోగం సంపాదించడాన్ని మనం చూస్తూ ఉంటాం. దీంతో ఎంపికలో ఏదో లోపం ఉందని భావించేవారూ లేకపోలేదు. అదృష్టం వల్లే ఇది సాధ్యమైందనేవాళ్లూ ఉంటారు. అయితే ఉద్యోగం రావడానికి కేవలం పర్సంటేజీలొక్కటే సరిపోవు. పనిచేయడానికి అవసరమైన మెలకువలన్నీ సమృద్ధిగా ఉంటేనే జాబ్ సొంతమవుతుంది. అందుకే మీరూ దానికి తగిన లక్షణాలు పెంపొందించుకోవాలి. అవేంటంటే..
- సాధారణ పరిమితులకు మించి భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి.
- సంబంధిత రంగంలో వస్తున్న మార్పులు, కొత్త పోకడలపై అవగాహన తప్పనిసరి. వాటిని పనికి ఎలా అన్వయించవచ్చో ఆలోచించే నేర్పరితనం ఉండాలి.
- ఇతరులతో చక్కగా మాట్లాడగలగాలి. ఉద్యోగంలో సహచరులతో కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్లడం తప్పనిసరి. కాబట్టి సంభాషణా చాతుర్యాన్ని పెంపొందించుకోవాలి.
- భావవ్యక్తీకరణ శక్తి మెండుగా ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి.. ఇవన్నీ తెలిసి ఉండాలి. ఈ ఎటికెట్స్ తెలియని వాళ్లకి ఉద్యోగం పొందే అవకాశాలు తక్కువ.
- చక్కని దార్శనికత, చొరవ తప్పనిసరి.
- లోకజ్ఞానంతోపాటు తగినంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలి.
- నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి మెండుగా ఉండాలి.
- పనిచేయాలనుకున్న సంస్థపై అవగాహన, సదభిప్రాయం తప్పనిసరి.
- సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. నిరాశావాదం పనికిరాదు.
- ప్రాథమ్యాలను గుర్తించగలగాలి. సమయ పాలన చాలా కీలకం.
- కొత్త అంశాలు నేర్చుకోవడానికి, కొత్త టెక్నాలజీపై పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
- ఒత్తిడిలోనూ పనిచేయగలిగే సామర్థ్యం పెంపొందించుకోవాలి.
- ఉద్వేగాలను అదుపులో పెట్టుకోగలగాలి.
- వాయిదావేసే తత్వం ఏ మాత్రం పనికిరాదు. బద్ధకాన్ని జయించాలి.
- కష్టపడే తత్వం మెండుగా ఉండాలి.
- అందరూ మెచ్చుకోగలిగే వ్యవహార శైలిని అలవాటు చేసుకోవాలి. అంటే మంచి టీమ్ ప్లేయర్‌గా ఉండాలి. దీనికోసం పారదర్శకంగా ఉంటూ, తోటి ఉద్యోగులకు పనిలో వీలైనంత సాయం చేయగలగాలి.
- బాగా రాయగలిగే నేర్పు, వ్యాపార మెలకువలు సొంతం చేసుకోవాలి.
పైన చెప్పిన లక్షణాలన్నీ అలవర్చుకోవడం పెద్ద కష్టమైన వ్యవహారం కాదు. మంచి లక్షణాలతోపాటు ఉద్యోగాన్ని కోరుకుంటున్న కంపెనీకి అవసరమైన స్కిల్స్ సొంతం చేసుకుంటే కొలువు ఖాయమైనట్టే.
ఇదీ చూడండి: ఐటీలో భారీగా ఉద్యోగాలు- ఏడాదికి రెండుసార్లు జీతం పెంపు!