జమ్ముకశ్మీర్‌లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా జవాను మరుపోలు జశ్వంత్‌రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనతో జవాన్ జశ్వంత్‌రెడ్డి సొంతూరు బాపట్ల మండలం దరివాద కొత్తవాసి పాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అందులో జశ్వంత్‌రెడ్డితో పాటు మరో భారత జవాన్ వీరమరణం పొందారు.
శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ కుమారుడు జశ్వంత్‌రెడ్డి. మరికొద్ది రోజుల్లో అతనికి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. కానీ ఈలోపు ఆయన ఉగ్రవాద దాడికి బలైపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జశ్వంత్‌రెడ్డి మృతదేహం బాపట్లకు పంపించేదుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జశ్వంత్‌రెడ్డి మద్రాస్ రెజిమెంట్‌లో 2016లో సైనికునిగా చేరారు. శిక్షణ తర్వాత నీలగిరిలో మొదటగా విధులు నిర్వహించారు. అనంతరం జమ్ముకశ్మీర్ వెళ్లారు. వీర జవాన్ జశ్వంత్‌రెడ్డి మృతికి ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.
సరిహద్దుల్లో మరణించిన సైనికుడు జశ్వంత్‌రెడ్డికి మాజీ సైనికుల సంఘం సంతాపం తెలిపింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొత్తపాలెంలోని జశ్వంత్‌రెడ్డి నివాసం వద్ద మాజీ సైనికులు నివాళి అర్పించారు. జశ్వంత్ రెడ్డి మృతదేహం ఇవాళ సాయంత్రానికి స్వగ్రామం చేరుకునే అవకాశం ఉంది. శనివారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దేశ రక్షణ కోసం జశ్వంత్ రెడ్డి మరణించడం మాజీ సైనికులుగా గర్విస్తున్నట్లు వారు తెలిపారు. జశ్వంత్ రెడ్డి మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు అస్వస్థతకు గురయ్యారు. జశ్వంత్ రెడ్డి తల్లి వెంకటేశ్వరమ్మ సొమ్మసిల్లి పడిపోగా వైద్యులు ఆమెకు చికిత్స అందించారు.
జశ్వంత్‌రెడ్డి(23) వీరమరణం పొందడంపై ఆ రాష్ట్ర సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ అక్కడి నుంచే ప్రభుత్వ సాయాన్ని ప్రకటించారు.
ఇదీ చదవండి: Drone Attack: జమ్మూలో డ్రోన్ల దాడి పాక్ పనే!