కరోనా లెక్కలపై మాట్లాడిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెరాస నేతలు ధ్వజమెత్తారు. కమల దళపతికి కొవిడ్ లెక్కలు తెలియకపోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కొవిడ్ మరణాల జాతీయ స్థాయి సగటు రేటు 3.26 శాతం ఉండగా... తెలంగాణలో 2.26 శాతమే ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా అంతర్జాతీయ రవాణా ఆపకుండా కరోనా దేశంలోకి ప్రవేశించడానికి భాజపానే కారణమైందని ఆరోపించారు. తెలంగాణ నిఘా వర్గాలు చెప్పే వరకు దిల్లీ మర్కజ్ వ్యవహారం బయటపడలేదని ఎద్దేవా చేశారు.
అవి రోజుకో మాటే వల్లిస్తున్నాయి..
కేంద్రం అధీనంలో ఉన్న ఐసీఎంఆర్, ఆయుష్‌లు రోజుకో మాట చెబుతున్నాయని ఆరోపించారు. కరోనా పరీక్షలకు సంబంధించి రోజుకో దేశం నుంచి రకరకాల కిట్లు తెప్పించి గందరగోళానికి గురి చేసింది కేంద్రం కాదా అని నేతలు నిలదీశారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో వెల్లడించాలని.. ఆ తరువాత తామేమి చేశామో చెబుతామన్నారు. కరోనాతో దేశం అంతా అట్టుడికిపోతుంటే.. భాజపా నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
వెలుపల చైనా.. లోపల భాజపా !
భాజపా నేతలు రాజకీయాలు మాట్లాడడానికి ఇది సమయమా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీకి అండగా ఉన్నామని స్పష్టం చేస్తే.. కమల దళ నేతలు రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. దేశ సరిహద్దుల్లో చైనా, దేశంలో కమల నేతలు వ్యవహరిస్తున్న తీరు రెండూ ఒక రకంగానే ఉన్నాయని మండిపడ్డారు.
ఓర్వలేకే ఈర్ష్య రాజకీయాలు...
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాలను ఓర్వలేక భాజపా నేతలు ఈర్ష్య రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్ర నేతలు ఎందుకు ప్రయత్నం చేయరని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు నీతి ఆయోగ్ ప్రశంసించిన విషయాన్ని తెరాస నేతలు గుర్తు చేశారు. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌కు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే భాజపా తప్పుడు విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి : హైదరాబాద్ నుంచి కరోనా మందు.. వారంలో హెటిరో ద్వారా 'కొవిఫోర్'