సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2016 జూన్ 2ను కటాఫ్ తేదీగా నిర్ణయించిన ప్రభుత్వం... ఐదెకరాల్లోపు చిన్న, సన్నకారు రైతులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుమును మినహాయించింది. ఐదు ఎకరాలు మించిన పెద్ద రైతులు... భూముల క్రమబద్ధీకరణ కోసం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే సాదాబైనామాల క్రమబద్ధీకరణ వర్తిస్తుందని... హెచ్ఎండీఏ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, నగరపాలికలు, పురపాలికలకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణ కోసం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
ఆధార్ కార్డు కాపీ, సాదాబైనామా డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అమ్మకందార్లకు, కొనుగోలుదార్లకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉంటే అవి కూడా అవసరం. దరఖాస్తుల పరిష్కారం కోసం మార్గదర్శకాలను విడిగా జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం ప్రక్రియ సాఫీగా జరిగేలా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు.. ఆరు మరణాలు