బీమా పాలసీ తీసుకున్నాం అంటే.. తీసుకున్నాం అన్నట్లు ఉంటే నడవని రోజులివి. ఏ పాలసీ తీసుకున్నాం.. దాని వల్ల మనకు ఎంత వరకూ ప్రయోజనం ఉంటుంది అనేది కచ్చితంగా లెక్కలు వేసుకోవాలి. ముఖ్యంగా 40 ఏళ్ల నడి వయసులోకి ప్రవేశించినప్పుడు.. ధీమాగా ఉండేలా బీమా పాలసీలను ఎలా ఎంచుకోవాలో చూద్దాం!
లెక్క వేసుకోండి...
ఉద్యోగంలో చేరినప్పటికీ.. ఇప్పటికీ ఎంతో తేడా ఉంటుంది. 21-22 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరినప్పుడు బాధ్యతల బరువు ఉండదు. 40 ఏళ్ల వయసుకు చేరుకున్నాక ఎన్నో రకాల బాధ్యతలు నెత్తిమీదకు వస్తాయి.. కాబట్టి, మన బాధ్యతలకు తగ్గట్టుగా బీమా ఉందా లేదా అనే విషయంలో స్పష్టత ఉండాలి. మీపై ఆధారపడిన వారు ఎందరు? అప్పులేమున్నాయి? వార్షికాదాయం? భవిష్యత్తులో ఉన్న ఖర్చులు.. ఇలా అనేక రకాల లెక్కలు బీమా ఎంత అవసరం అనేది విశ్లేషించడానికి తోడ్పడతాయి.
పూర్తి రక్షణకే...
ఉద్యోగంలో చేరిన రోజుకూ.. ఇప్పుడూ ఆదాయంలో ఎంతో వృద్ధి కనిపిస్తుంది. అప్పటి లెక్కల ప్రకారం తీసుకున్న బీమా పాలసీకి.. ఇప్పటి అవసరాలకూ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చదువుకునే పిల్లలు.. పెద్దవారైన తల్లిదండ్రులు ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇలా పెరిగిన బాధ్యతలకు అనుగుణంగా బీమా పాలసీ విలువ కూడా అధికమవ్వాలి.
తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీని తీసుకోవడం ఇప్పుడు ఎంతో అవసరం. ఇంతకుముందే తీసుకుంటే.. దాని విలువ ప్రస్తుత మీ అవసరాలకు తగ్గట్టుగా ఉందా లేదా తనిఖీ చేసుకోండి. బీమా పాలసీల ఎంపికలో పెట్టుబడికి ప్రాధాన్యం ఉన్నవి కాకుండా.. పూర్తి రక్షణకే ప్రాధాన్యం ఇవ్వడం అవసరం.
ఆరోగ్యంగా..
వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం. నలభైలోకి వచ్చేసరికి మధుమేహం, రక్తపోటు, గుండెకు సంబంధించిన వ్యాధులు పెరుగుతుండటం ఇప్పుడు గమనిస్తూనే ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఏ ఇబ్బందీ ఉండదు. ఒక్కసారి ఇలాంటి జీవనశైలి వ్యాధుల బారిన పడ్డామా.. ఇక ఆదాయంలో కొంత భాగం వీటికి వదిలించుకోక తప్పదు.
ప్రస్తుతం నాణ్యమైన వైద్యానికి అధిక ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో అనారోగ్యం వచ్చినప్పుడు.. మన దగ్గరున్న పొదుపు మొత్తం హరించుకుపోకుండా చూసుకోవాలి. అందుకోసం ఉన్న మార్గం.. ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం. మీతోపాటు.. కుటుంబంలోని అందరికీ ఆరోగ్య బీమా పాలసీ ఉండేలా చూసుకోండి. జీవిత బీమా తర్వాత.. రెండో స్థానం దీనికే ఇవ్వాలి.
తీవ్ర వ్యాధులకూ...
ప్రాంణాంతక వ్యాధులైన క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతంలాంటివి ఇప్పుడు ఎంతో మందిని బాధించడం చూస్తూనే ఉన్నాం. 20, 30 ఏళ్ల వయసులో ఉన్నవారికన్నా నడి వయసులో ఉన్నవారికి ఇవి వచ్చేందుకు ఉన్న అవకాశాలు ఎక్కువే. దురదృష్టవశాత్తూ ఇలాంటి వ్యాధుల బారిన పడ్డా.. ఆర్థికంగా దెబ్బపడకుండా చూసుకోవాలి. అందుకోసం తప్పనిసరిగా క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీల్లాంటివి ఎంచుకోవడం మంచిది. దీనిని ప్రత్యేకంగా ఎంచుకోవచ్చు.. లేదా ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీతో కలిపి తీసుకున్నా ఇబ్బందేమీ ఉండదు.
వ్యక్తిగత ప్రమాద బీమా
నిత్యం ఎన్నో ప్రమాద వార్తలు వింటుంటాం.. ఇలా ప్రమాదం బారినపడ్డవారు శారీరకంగా వైకల్యం పొందవచ్చు లేదా మరణించే ఆస్కారమూ ఉంది. ఇలాంటి అనుకోని సంఘటన కుటుంబానికి చిన్నాభిన్నం చేయకుండా తగిన ఆర్థిక రక్షణ కల్పించాలి. 20, 30 ఏళ్లతో పోలిస్తే.. నడి వయసులో ప్రమాదాల బారిన పడే వారి సంఖ్య కాస్త తక్కువే అనేది గమనించవచ్చు. కాకపోతే.. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దు కాబట్టి, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ విషయంలోనూ నిర్లక్ష్యం చేయకూడదు.
ఆలస్యం కాలేదు..
వయసు పెరుగుతున్న కొద్దీ.. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు చెల్లించాల్సిన ప్రీమియం పెరుగుతుంది. నిజమే.. కానీ.. ఇప్పుడే జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరం ఎక్కువగా ఉంటుంది. బీమా కంపెనీలు నడివయసు వారికి పాలసీలు ఇచ్చేప్పుడు ఆరోగ్య పరీక్షలనూ అడుగుతుంటాయి. ఈ దశలో మీకు బీమా పాలసీలు ఇవ్వడం వాటికి కాస్త ఇబ్బందిగానే తోస్తుంది.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీమా తీసుకోకుండా ఉండటం ఎప్పుడూ మంచిది కాదు.. ఇప్పటికైనా ఈ రెండు పాలసీలనూ ఎంచుకొని, కాస్త అధిక ప్రీమియం చెల్లించినా.. ధీమాగా ఉండటం మేలు. జీవితంలో క్రమశిక్షణతో ఉంటూ.. ఎలాంటి దురలవాట్లు లేకుంటే.. ప్రీమియం పెద్దగా ఎక్కువేమీ ఉండదు. ఉదాహరణకు 20, 30 ఏళ్ల పొగతాగే వ్యక్తికి వర్తించే ప్రీమియంతో పోలిస్తే.. 40 ఏళ్ల వయసు వారికి బీమా ప్రీమియం తక్కువే.
ఇప్పటికైనా..
ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడం మేలు. రేప్పొద్దున దురదృష్టవశాత్తూ ఏదైనా వ్యాధి బారిన పడితే.. బీమా పాలసీలు ఇవ్వడానికి సంస్థలు నిరాకరించవచ్చు. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది.
విలువ పెరగాలి..
ఇప్పటికే బీమా పాలసీలు తీసుకున్నాం.. ఇంకా అవసరమా? అనుకోకండి. ఒకసారి మీ అవసరాలను పూర్తిగా లెక్కలేసుకోండి. ప్రస్తుతం ఉన్న బీమా మొత్తంతోనే సరిపోతుందా? ఏమైనా పెంచుకోవాల్సిన అవసరం ఉందా చూసుకోండి. మీ ఆదాయం పెరిగినప్పుడు మీ జీవిత బీమా విలువ కూడా పెరగాలి. ఒకసారి ఎంత మొత్తం కావాలో తెలుసుకున్నాక.. ఆ వ్యత్యాసాన్ని బట్టి, మిగతా మొత్తానికి పాలసీని తీసుకోండి.
అదొక్కటే సరిపోదు..
చాలా యాజమాన్యాలు.. తమ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను అందిస్తుంటాయి. అయితే, ఈ పాలసీలు ఉన్నంత మాత్రాన సొంతంగా పాలసీలు అవసరం లేదనుకోవడం సరికాదు. కుటుంబ సభ్యులు పెరుగుతున్న కొద్దీ.. మీ ఆర్థిక అవసరాలూ అధికమవుతాయి. గృహరుణం, కారు కొనేందుకు చేసిన అప్పులూ కలుస్తాయి. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరైన మొత్తానికి సొంతంగా ఒక బీమా పాలసీని తీసుకోవడం ఉత్తమం. మీరు ఉద్యోగం మానేస్తే.. బీమా రక్షణ దూరమవుతుంది. అప్పుడు కొత్త పాలసీలు తీసుకోవడానికీ సాధ్యం కాని పరిస్థితులు ఉండవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని.. సొంత పాలసీకి ప్రాధాన్యం ఇవ్వండి.
పన్ను ఆదా చేయండి
జీవిత, ఆరోగ్య బీమా పాలసీలతో ఆదాయపు పన్ను మినహాయింపులూ ఉంటాయి. జీవిత బీమా పాలసీ వ్యవధి తీరిన తర్వాత వచ్చే మొత్తానికీ ఎలాంటి పన్ను ఉండదు. కాబట్టి, పాలసీలను తీసుకునేప్పుడు ఈ ప్రయోజనాన్నీ లెక్కలోకి తీసుకోవాలి.
- అనిక్ జైన్, సీఈఓ, సహ వ్యవస్థాపకుడు, సింబో ఇన్సూరెన్స్
ఇదీ చూడండి: మోదీతో రాజ్నాథ్ భేటీ.. సరిహద్దు ఘర్షణపై వివరణ