సీఈఓ క్లబ్ హైదరాబాద్ ఛాప్టర్‌లోని వివిధ కంపెనీలకు చెందిన 100 మంది ఉన్నత స్థాయి ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాల్ ద్వారా చర్చలు జరిపారు. లాక్ డౌన్ ముగింపునకు సంబంధించిన ప్రణాళికను తయారు చేసేందుకు గత కొన్ని రోజులుగా పలు పరిశ్రమల సంఘాలతో సమావేశమవుతున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశ్రమల ప్రతినిధులు ప్రశంసించారు. పరిశ్రమల ఆందోళనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని మంత్రిని కోరారు. ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను పెంచామని, భవిష్యత్‌లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వెల్లడించారు.
సహకరించినందుకు కృతజ్ఞతలు...
వైరస్ వ్యాప్తిని బట్టి ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా మార్పులు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. సరైన సమయంలో భారత్ స్పందించిందని, లాక్ డౌన్ ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోందని ప్రతినిధులు అన్నారు. కరోనాను నిరోధించడానికి ఎలాంటి అవకాశాలను వదులుకోవట్లేదని మంత్రి స్పష్టం చేశారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి సంక్షిప్తంగా వివరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేస్తామన్నారు. లైఫ్ సైన్సెస్‌పై అందరు దృష్టి సారించటం భాగ్యనగరానికి కలిసి వస్తోందనన్నారు. అలాంటి చర్య రాష్ట్రం వృద్ధిలో దూసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. విపత్కర పరిస్థితుల్లో సహకరించినందుకు సీఈఓ క్లబ్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సాధ్యమైనంత మేర పరిశ్రమల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.