Startup 20 summit in Hyderabad: అంకుర సంస్థల రంగంలో మూడో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ఆ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. G-20 కూటమికి దేశం నాయకత్వం వహిస్తున్న వేళ హైదరాబాద్ కేంద్రంగా ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు "స్టార్టప్-20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్" సమావేశాన్ని నిర్వహిస్తోంది. అంకుర సంస్థలకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతోంది. ఇందుకోసం 'G-20' సభ్యదేశాల ప్రతినిధులతో పాటు 9మంది ప్రత్యేక ఆహ్వానితులు, పలుఅంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
సంస్థల మధ్య సమన్వయం కోసం చర్చ జరగనుంది: రానున్న రోజుల్లో G-20 దేశాలతో పాటు ప్రపంచదేశాల్లో వ్యవస్థాపకత, ఆవిష్కరణల రంగాలకు ప్రాధాన్యత పెరుగనున్న దృష్ట్యా వాటి అభివృద్ధికి దోహదపడే విధాన నిర్ణయాలపై సభ్య దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో చర్చించనున్నారు. స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారం, కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఆవిష్కరణ రంగంలో ఉన్న సంస్థలు, స్టార్టప్ రంగంలో సంస్థల మధ్య సమన్వయం సాధించడానికి పటిష్ఠ వ్యవస్థను నిర్మించటంపై ఈ సదస్సులో చర్చ జరగనుంది.
స్టార్టప్‌లకు నూతన అవకాశాలు కోసం చర్చ: ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్న రంగాల్లో వినూత్న స్టార్టప్‌లను అందించే అంశంలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న భారత్‌ను వాటి మధ్య సమన్వయం సాధించడానికి, నూతన అవకాశాలు గుర్తించడానికి అవసరమైన విధానాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఇంక్యుబేటర్లు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతర సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు కుదిరేలా సమాచార మార్పిడి ద్వారా సమస్యలను పరిష్కరించనునున్నారు. స్టార్టప్‌లతో పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేయడానికి దోహదపడే సహాయక విధానాన్ని ఈ సదస్సు ద్వారా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫౌండేషన్, అలయన్స్ టాస్క్‌ఫోర్స్ కృషి: 'స్టార్టప్-20'లో ఫౌండేషన్, అలయన్స్ టాస్క్‌ఫోర్స్, ఫైనాన్స్, ఇన్‌క్లూజన్, సస్టైనబిలిటీ పేరుతో 3 ప్రధాన టాస్క్‌ఫోర్స్‌లు పనిచేయనున్నాయి. ప్రపంచ స్టార్టప్ రంగం మధ్య సమన్వయం సాధించడానికి, నూతన అవకాశాలను గుర్తించి స్టార్టప్ సంస్థల మధ్య ప్రపంచవ్యాప్తంగా సమాచార మార్పిడి జరిగేలా చూసేందుకు ఫౌండేషన్, అలయన్స్ టాస్క్‌ఫోర్స్ కృషి చేస్తుంది. స్టార్టప్‌లకు మూలధన పెట్టుబడులు సమకూర్చడం, ప్రారంభ దశ స్టార్టప్‌లకు ప్రత్యేకంగా ఆర్థిక, పెట్టుబడి వనరులు అందుబాటులోకి తెచ్చి స్టార్టప్‌లకు మూలధనం లభ్యత పెంచడం లక్ష్యంగా ఫైనాన్స్ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది.
హైదరాబాద్‌లో 'స్టార్టప్-20' ప్రారంభ కార్యక్రమం: మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు, సంస్థలకు మరింత సహకారం అందించడానికి అవసరమైన చర్యలను ఇన్‌క్లూజన్, సస్టైనబిలిటి గుర్తించి అమలు చేస్తుంది. ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్న స్టార్టప్‌లకు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్న ఎస్డీజీ రంగాలపై పనిచేస్తున్న స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఇన్‌క్లూజన్, సస్టైనబిలిటీ టాస్క్‌ఫోర్స్ విధానాలు రూపొందిస్తుంది. ఈ రెండ్రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగే 'స్టార్టప్-20' ప్రారంభ కార్యక్రమంగా జరుగనుండగా.. ఈ ఏడాది జులై 3న గురుగ్రాంలో ప్రధాన సదస్సు జరగనుంది.
ఇవీ చదవండి: