భారత్‌ను ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా నిలబెట్టడంలో ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకున్నారని భాజపా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధిని 'బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్' పుస్తకంలో ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆరేళ్లలోనే దేశంలో జాతీయ భావం ధృఢంగా మారిందని తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఆయన రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుస్తకంపై జరిగిన చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చైనా, పాకిస్తాన్ ఆగడాలకు అడ్డుకట్ట:
మోదీ హయాంలో దేశంలో ఐకమత్యం పెరిగి.. తీవ్రవాదం సమాప్తమైందన్నారు. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు, పాకిస్తాన్ తీవ్రవాదానికి అడ్డుకట్ట వేసేలా ధృఢమైన విధానాన్ని భాజపా ప్రభుత్వం అమలు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. కశ్మీర్ విషయంలో అనుసరించిన విధానం, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను, రైతులకు సంబంధించిన అంశాలను పుస్తకంలో పొందుపర్చినట్లు రాంమాధవ్ తెలిపారు. కేంద్రం రైతుల సమస్యల పరిష్కారం కోసం సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. కొన్ని రైతు సంఘాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. రైతు సంఘాలు తమ మొండి పట్టుదలను వదిలేసి ప్రభుత్వంతో చర్చించి.. ఏయే మార్పులు కావాలో వాటిని చర్చించి ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.
వ్యవసాయ చట్టాలను అర్థం చేసుకోవాలి:
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు సంస్కరణలను సరైన రీతిలో అర్థం చేసుకుని ముందుకు వెళితే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ విధానాలు రైతులకు మేలు జరిగేలా ఉండాలని ఆయన సూచించారు. రామ మందిర నిర్మాణాన్ని దేశమంతా స్వాగతిస్తోందన్నారు. అయోధ్యలో రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ముస్లింలతో సహా అన్ని మతాలు స్వాగతించాయని ఆయన గుర్తు చేశారు. భారత్ -అమెరికా దేశాల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు.