Independence day diamond jubilee: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి బోట్స్ క్లబ్ వరకు సాగిన ర్యాలీని ఉత్సవ కమిటీ ఛైర్మన్ కేశవరావు, సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రారంభించారు. వివిధ శాఖల ఉద్యోగులతో పాటు విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ రాంనగర్‌లో బండారు దత్తాత్రేయ తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివర్ణ పతాకాలను స్థానికులకు పంపిణీ చేశారు.
సంగారెడ్డిలో చేపట్టిన భారీర్యాలీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. దేశంలో అసమానతలు, పేదరికం రూపుమాపేందుకు.. యువత ముందుకురావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఫ్రీడమ్ వాక్ నిర్వహించారు. గన్‌పార్కు నుంచి లుంబినీ పార్కు వరకు నిర్వహించిన నడక కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎన్జీవో నేతలు, విద్యార్థులతో కలిసి ఫ్రీడమ్ వాక్‌లో పాల్గొన్నారు.
హనుమకొండలో పోలీస్ పరేడ్ మైదానం నుంచి బస్టాండ్ వరకు ఫ్రీడం ర్యాలీ చేపట్టారు. ఈ ప్రదర్శనను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రారంభించారు. ఈ నెల 16న జరిగే సామూహిక జాతీయ గీతాలాపనలో అందరూ పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో 2 కిలో మీటర్ల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. సుమారు 10వేల మంది జాతీయ జెండా చేతబూని జిల్లా పరిషత్ నుంచి పటేల్ స్టేడియం వరకు ర్యాలీ చేశారు. ఇందులో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
జాతీయ నేతల వేషదారణలో చిన్నారులు సందడి చేశారు. విద్యార్థులు ఉత్సాహంగా దేశ భక్తి గీతాలు ఆలపించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. పోలీస్ బెటాలియన్ సహకారంతో బుల్లెట్ వాహనాలతో వెయ్యి అడుగుల జాతీయ జెండా ప్రదర్శించారు. వేలాదిమంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు.
హన్మకొండ జిల్లా కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ర్యాలీలు ఘనంగా జరుగుతున్నాయి. స్వతంత్ర భారత వజ్రత్వంలో భాగంగా హనుమకొండలో ఏకశిలా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వజ్రోత్సవ ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, జాతీయ జెండా రూపకర్త పింగిలి వెంకయ్య ముని మనవడు విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వతంత్ర సమరయోధుల త్యాగాలను తెలియజేసేందుకు వజ్రోత్సవ ర్యాలీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ వజ్రోత్సవ ర్యాలీలో పాల్గొనాలన్నారు. దేశం పట్ల ప్రేమను పొందే విధంగా వజ్రోత్సవ ర్యాలీలు జరుగుతున్నాయని తెలిపారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వైదిక కమిటీ సిబ్బంది జాతీయ జెండాలతో ఆలయ ప్రదక్షిణ గిరిప్రదక్షిణ ర్యాలీ నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ భద్రాద్రి ఆలయం నుంచి బయలుదేరిన వైదిక కమిటీ సిబ్బంది తాతగుడి సెంటర్ వరకు భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా భువనగిరి పట్టణంలో 300 మీటర్ల జాతీయ జండాను ర్యాలీగా ప్రదర్శించారు. భువనగిరి మున్సిపాలిటీ , జిల్లా విద్యాశాఖ, యువజన విభాగం, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా కొనసాగింది. విద్యార్థులు భువనగిరి ఫోర్టు మెట్ల మీదుగా జాతీయ జండా ను ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యార్థులు , మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 300 మీటర్ల జాతీయ జెండాను భువనగిరి పట్టణంలో, భువనగిరి ఫోర్టు మెట్ల మీద ప్రదర్శించడంలో పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
75వ భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్రీడమ్ ర్యాలీ, బెలూన్ల ఎగరవేత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జడ్పీ ఛైర్పర్సన్ అరుణ, మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళలు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ నుంచి ప్రారంభమైన ఫ్రీడమ్ ర్యాలీ గాంధీ చౌక్, అంబేడ్కర్ చౌరస్తా మీదుగా జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంది. కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బెలూన్లను ఎగరవేశారు. ఫ్రీడం ర్యాలీ సందర్భంగా వంద మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
మిర్యాలగూడలో భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 15 రోజులు పట్టణ ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈరోజు 750 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శనను మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, మహిళలు, ప్రజాప్రతినిధులు మువ్వన్నెల జెండాను చేతబూని సాగర్‌రోడ్‌లో ప్రదర్శన చేపట్టారు.
75వ భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని కుమురంభీం కాగజ్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే కోనేరు కొనప్ప జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో పట్టణంలోని పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎస్పీఎం క్రీడా మైదానంలో కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, పురపాలక కమిషనర్ అంజయ్య, పలువురు ప్రజాప్రతినిధులు మూడు రంగుల బెలూన్లు ఎగురవేశారు.
ఇవీ చదవండి: నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రంథాలయాలు.. మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరం
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం