రాష్ట్రంలో 48,400 పైచిలుకు ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా మొదటి దశలో సుమారు ఏడు నెలలకు పైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరిగి రెండో దశ ఉద్ధృతిలో కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. దీంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇటీవలే రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో తిరిగి కళకళలాడుతున్నాయి. అయితే ఆదాయం మాత్రం తగ్గిపోయింది. 2020 ఏప్రిల్, మే నెలలో ఆర్టీసీకి సరాసరిగా రూ.3179 లక్షల ఆదాయం సమకూరేది. మార్చి 23న లాక్‌డౌన్‌తో బస్సులు డిపోలకు పరిమితం కావడంతో ఆదాయంపై ప్రభావం చూపింది. ఇక..ఆ సమయంలో ఆర్టీసీకి రోజుకి రూ.52 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనావేశారు. ఆ సమయంలో లాక్ డౌన్ కారణంగా ఒక బస్సు రోజుకి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే తిప్పినట్లు తెలుస్తోంది. అప్పుడు కిలోమీటర్ కు రూ.1835 వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. 2021లో ఏప్రీల్, మే నెలలో 29,238 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ సుమారు రూ.479లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక బస్సు రోజుకి సరాసరి 18 కిలోమీటర్ల వరకు తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కిలోమీటరుకు రూ.2,661లు వస్తున్నట్లు సమాచారం.
ఉద్యోగులపై ఒత్తిడి!
ప్రస్తుతం ఆర్టీసీ యాజమాన్యం కిలోమీటర్లు, ఆర్టీసీ బస్సుల ఆదాయంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తిరిగి ఆర్టీసీకి మునుపటి రోజులు రావాలంటే.. ప్రజల ఆదరణ పొందాలంటే...ఆదాయం రాబట్టడమే మార్గం అన్నట్లుగా యాజమాన్యం వ్యవహరిస్తున్నట్లుగా కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంటున్నారు. డిపోల వద్దకు వచ్చిన వారికి సరైన విధంగా విధులు కేటాయించకపోవడంతో కార్మికులు మానసిక వేదనకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన తిరుపతిరెడ్డి రాణిగంజ్ డిపో-1లో విధులు నిర్వర్తిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అతడికి విధులు కేటాయించకపోవడంతో మంగళవారం డ్యూటీ చేసేందుకు వచ్చాడు. విధులు కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రాణిగంజ్ డిపో కార్మికులు తెలిపారు. అతడిని తక్షణమే ఆసుపత్రికి తరలించగా..ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందాడని కార్మికులు పేర్కొన్నారు. శాస్త్రీయంగా ఆలోచన చేయకుండా ట్రాఫిక్‌ను అంచనా వేయకుండా కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ..కార్మికులు కార్మిక సంఘాల నేతలు రాణిగంజ్ డిపో ముందు ధర్నా నిర్వహించారు. రాణిగంజ్ డిపో డీఎం మాత్రం కార్మికులపై ఎటువంటి వేధింపులు జరగలేదని ఖండించారు.
ఇదీ చదవండి: విధుల్లోకి తీసుకోవట్లేదని పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య..!