ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రకాల మనుషులు ఎక్కువగా కన్పిస్తున్నారు. నచ్చింది లెక్కలేకుండా తినేసి ఆరోగ్యం సంగతి ఏమాత్రం పట్టించుకోనివారు ఒక రకమైతే, తినే ప్రతి పదార్థాన్నీ క్యాలరీల్లో లెక్కలేసుకునేవారు మరో రకం. వయసునీ ఆరోగ్య పరిస్థితినీ దృష్టిలో పెట్టుకుని సరైన ఆహారాన్ని, సమయానికి, సమపాళ్లలో-తీసుకునేవారితో ఏ గొడవా లేదు. పై రెండు రకాల వారితోనే ఇబ్బంది అంతా అంటారు పోషకాహార నిపుణులు. జిహ్వచాపల్యంతో నోరు కట్టుకోలేనివారు తమ ఆరోగ్యానికి సరిపడనివీ తినేసి సమస్యలు తెచ్చుకుంటుంటే, అతి జాగ్రత్త పడేవారు. అవసరమైన పదార్థాలు కూడా చాలినంత మోతాదులో తినకుండా సమస్యలు తెచ్చుకుంటున్నారట. ఆహారపదార్థాల గురించీ అందులోనూ ప్రత్యేకించి కొవ్వుపదార్థాల గురించీ సరైన అవగాహన లేకపోవడమే సమస్యలన్నిటికీ మూలం అన్నది నిపుణుల మాట. కొవ్వు పదార్థాల్లో ఏది మంచిదో ఏది కాదో తెలుసుకుని ఆహారంలో సమతూకం పాటిస్తే ఆరోగ్యం మన వెంటే ఉంటుందన్నది వారు ఇస్తున్న హామీ. ఆ మంచి చెడులేమిటో చూసేద్దామా మరి!
కొవ్వు అంటే కొలెస్ట్రాలేగా..?
కొలెస్ట్రాలే... అయితే అందులోనూ మంచీ చెడూ రెండు రకాలుంటాయి. కొలెస్ట్రాల్ అనగానే గుండెను గుర్తుచేసుకుని అందరూ భయపడిపోతారు. కానీ నిజానికి అది మన శరీరానికి చాలా అవసరమే కాదు, అణువణువునా ఉంటుంది కూడా. మన శరీరంలోని ప్రతి కణం పొర దానితోనే తయారవుతుంది. మనం తీసుకునే ఆహారపదార్థాలనుంచి ఎక్కువగా కాలేయంలో ఇది తయారవుతుంది. కొవ్వు లేకపోతే అసలు బతకలేం. మెదడు, కాలేయం, పేగులు, లింఫ్ నాళాలు.. ఇలా శరీరంలోని వేర్వేరు భాగాల్లో అది వేర్వేరు రూపాల్లో ఉంటుంది. వేర్వేరు పనులు చేస్తుంది. మొత్తంగా మన శరీర బరువులో పదిశాతం కొవ్వే. మెదడులో అయితే ఏకంగా 60 శాతం అదే. అందులో ఏ ఒక్కశాతం తగ్గినా మన మెదడు పనితీరు అస్తవ్యస్తమైపోతుంది. అంతే కాదు, చర్మం నిగనిగా మెరిసేలా చూసేదీ అవయవాలు దెబ్బతినకుండా కాపాడేదీ కొవ్వే. ఎన్నోరకాలుగా మన మనుగడకి తోడ్పడే కొవ్వుని భయం భయంగా చూడొద్దనీ దాని విలువ తెలుసుకోవాలనీ చెబుతున్నారు పరిశోధకులు. అప్పుడే ఆహారంతో అర్థం లేని ప్రయోగాలు చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు.
కొవ్వు ఇంత అవసరమా?
అవును, చాలా అవసరం. ఆరోగ్యకరమైన శరీరానికి కావలసిన హార్మోన్ల తయారీలో కీలక పాత్ర కొవ్వుదే. పలు జీవక్రియలను ప్రేరేపించే హార్మోన్లలో ముఖ్యమైనవి స్టెరాయిడ్ హార్మోన్లు. తక్షణ శక్తిని అందిస్తాయివి. ఇన్‌ఫెక్షన్లూ గాయాలూ అయినప్పుడు రక్షణ వ్యవస్థను ప్రేరేపించి కోలుకోవడానికి తోడ్పడతాయి. వీటి తయారీకి మూలకారకం కొవ్వే. చర్మం కింద, కడుపులో, అవయవాల చుట్టూ... ఇలా ప్రతిచోటా ఉండే కొవ్వు శరీరానికి రక్షణ వ్యవస్థలా పనిచేస్తుంది. వాతావరణ ప్రభావం పడకుండా శరీర ఉష్ణోగ్రత తగినంత ఉండేలా చూస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి వాటి దుష్ప్రభావాలు మన మీద పడకుండా కాపాడుతుంది. తిన్న ఆహారంలో మనకు సరిపడని పదార్థాలుంటే వాటిని సాధ్యమైనంతవరకూ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. మన ఆరోగ్యానికి తోడ్పడే ఎ, డీ, కే లాంటి ప్రధాన విటమిన్ల పుట్టుకకు కొవ్వే కారణం. నాడులకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. వాటి మీద ఉండే కొవ్వు పొర దెబ్బతింటే ఫిట్స్, మతిమరపు లాంటి సమస్యలెన్నో వస్తాయి. ఆహారం విషయంలో కొవ్వు గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా లెప్టిన్ హార్మోన్ గురించి తెలుసుకోవాలి.
అదేం చేస్తుంది?
లెప్టిన్ హార్మోన్ మనకి కడుపు నిండిన భావన కలిగిస్తూ ఆకలి తగ్గేలా చేస్తుంది. శరీరంలోని అన్ని కణాల్లోనూ ఎక్కడికక్కడే కొవ్వులో నుంచి ఇది పుడుతుంది. దీని ఉత్పత్తి ఎక్కువైనా తక్కువైనా ఆకలి తీరుతెన్నులే మారిపోతాయి. ఈరోజుల్లో మనం ఎదుర్కొంటున్న ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి జబ్బులన్నింటికీ లెప్టిన్ పనితీరు అస్తవ్యస్తం కావటమే కారణమంటున్నారు నిపుణులు. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే-మన శరీరం చాలా శక్తిమంతమైనది. తన అవసరాలకు తగినట్లుగా పిండి పదార్థాలను కొవ్వుగానూ కొవ్వును పిండిపదార్థాలుగానూ కూడా మార్చుకోగలదు. కొవ్వు పదార్థాలను మనం అసలేం తీసుకోకపోయినా కూడా కణాల్లో కొవ్వు తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కేవలం కొవ్వు పదార్థాలనో పిండి పదార్థాలనో మాత్రమే తగ్గించుకోకుండా మొత్తంగా ఆహారం పరిమాణాన్ని తగ్గించుకోవాలి. క్యాలరీలు తగ్గినప్పుడు శరీరం నిల్వ ఉన్న కొలెస్ట్రాల్‌ని ఉపయోగించుకుంటుంది. అప్పుడు కొవ్వు నిల్వలు తగ్గి బరువు తగ్గడానికి వీలవుతుంది. అంతేకానీ పిండిపదార్థాలనో ప్రొటీన్లనో ఎక్కువగా తీసుకుంటూ కేవలం కొవ్వు పదార్థాల్ని మాత్రం తగ్గించి బరువు తగ్గుతామని అనుకోకూడదు. అలాగని మిగతావాటిని తగ్గించి అచ్చంగా కొవ్వు పదార్థాలనీ తీసుకోకూడదు. అన్నిటినీ లెక్క ప్రకారం ఉండేలా చూసుకోవాలి.
ఏమిటీ ఆ లెక్క?
మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు 55 శాతానికి తగ్గకూడదు. 55-65 శాతం మధ్య అవి ఉండేలా చూసుకోవాలి. కొవ్వులు 25 శాతం, మాంసకృత్తులు 15 శాతం ఉండాలి. అలాగే బాడీ మాస్ ఇండెక్స్ 23 కన్నా మించితే దాని మేరకు క్యాలరీలను తగ్గించుకునేందుకు తగిన వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తున్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు తినడమూ మంచిది కాదు. ఒక్క వ్యాయామంతో బరువు తగ్గదు. ఆహార పరిమాణాన్ని తగ్గించుకుంటూనే వ్యాయామమూ చేయాలి. ఇవన్నీ కూడా వైద్యుల, పోషకాహార నిపుణుల సలహాతో చేయాలి కానీ సొంత వైద్యం పనికిరాదు. కొంతమంది కొవ్వు తగ్గించుకోడానికి మందులూ వాడతారు. అది చాలా హానికరం.
కొవ్వు ఎప్పుడు ‘చెడు’ అవుతుంది?
కొవ్వు శరీరంలోని వేర్వేరు భాగాల్లో వేర్వేరు రూపాల్లో ఉంటుంది. అందులో ఉండే లిపోప్రోటీన్ల ఆధారంగా దీన్ని హైడెన్సిటీ లిపో ప్రొటీన్- హెచ్‌డీఎల్ అనీ, లో డెన్సిటీ లిపోప్రొటీన్- ఎల్‌డీఎల్ అనీ అంటారు. హెచ్‌డీఎల్ మంచిది కాబట్టి అది ఎక్కువ ఉండాలి. ఎల్‌డీఎల్ చెడ్డ కొవ్వు, తక్కువ ఉండాలి. ఈ రెండిటితో పాటు ట్రై గ్లిజరైడ్స్ స్థాయుల్ని కూడా పరీక్షల్లో చూస్తారు. ఇవన్నీ రక్తంలో ఉండే కొవ్వు రకాలు. ట్రై గ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయంటే శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉందనీ టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉందనీ అర్థం. ఎల్‌డీఎల్‌లో ఉండే లిపోప్రోటీన్లు రక్తనాళాల్లో గోడలకు అతుక్కుపోతాయి. దంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే పాచి ఎలా పేరుకుపోతుందో రక్తనాళాల్లోనూ ఈ కొవ్వు అలా పేరుకుని కొన్నాళ్లకు రక్తనాళాన్ని ఇరుగ్గా మార్చేస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం పూడుకుపోతే హార్ట్ ఎటాక్ వస్తుంది. అందుకే మనకి కొలెస్ట్రాల్ అనగానే గుండె గుర్తుకువస్తుంది. మెదడుకి రక్తాన్ని సరఫరా చేసే నాళం పూడుకుపోతే స్ట్రోక్ వస్తుంది. కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే నాళం పూడుకుపోతే నడిచేటప్పుడు విపరీతమైన నొప్పులు రావటం, కాళ్లమీద పుండ్లుపడటం లాంటి సమస్యలు వస్తాయి. కిడ్నీలోని రక్తనాళాలు దెబ్బతింటే మూత్రపిండాల పనితీరు విఫలమవుతుంది. అయితే హెచ్‌డీఎల్‌లో ఉండే లిపోప్రోటీన్లు రక్తనాళాల్లో ఈ పూడికలు పేరుకోకుండా చూస్తాయి. ఆ చెడుకొవ్వును తిరిగి కాలేయానికి పంపిస్తాయి. అక్కడ దాన్ని రీసైకిల్ చేయడమో లేక వ్యర్థాలుగా విసర్జించడమో జరుగుతుంది. అందుకే హెచ్‌డీఎల్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. రక్తనాళాల్లో పూడికలే కాదు చెడుకొవ్వు వల్ల క్యాన్సర్లూ వస్తాయి.
కొలెస్ట్రాల్ ఎంతుందో ఎలా తెలుస్తుంది?
రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి సూచనలూ లక్షణాలేవీ మన ఆరోగ్యంలో కనిపించవు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాల్సిందే. జన్యుపరంగా, వయసు పెరిగే కొద్దీ, కొన్నిరకాల మందులవాడకం వల్లా, స్థూలకాయం ఉంటే, తీసుకునే ఆహారాన్ని బట్టీ, అసలు వ్యాయామం లేకపోయినా, పొగతాగినా... కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు నలభై లక్షల మంది మృత్యువాత పడడానికి అధిక కొవ్వు కారణమవుతోందని అధ్యయనాల్లో తేలింది. అందుకే నాలుగేళ్ల కొకసారైనా ప్రతి ఒక్కరూ రక్తంలో కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాలను బట్టి జాగ్రత్తలూ తీసుకోవాలి.
ఎలాంటి జాగ్రత్తలు?
ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ సమతులాహారం తీసుకోవాలి. మాంసాహారం తగ్గించి, పొట్టుతో ఉండే తృణధాన్యాలూ తాజా కూరగాయలూ పండ్లూ ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. పరిస్థితిని బట్టి అవసరమైతే మందులూ వాడాల్సి ఉంటుంది.
కొవ్వు పదార్థాలు మానేస్తే?
కొందరు అలాంటి పనులూ చేస్తారు. అతి ఎలా మంచిది కాదో, అసలు తీసుకోకపోవడమూ అంతే మంచిది కాదు. ఉదాహరణకి...
నూనె మానేయడం: అసలు నూనె లేకుండా ఆహారపదార్థాలను ఆవిరి మీద ఉడకబెట్టుకుని తినడం సరికాదు. నూనెల వల్ల కూడా శరీరానికి పోషకాలూ, శక్తీ అందుతాయి. ఆహారం ద్వారా మనకు లభించే క్యాలరీల్లో కనీసం 20 శాతం నూనెల నుంచి రావటం అవసరం. శరీరానికి అత్యవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్) నూనెల నుంచే లభిస్తాయి. కొన్ని జీవక్రియలు సజావుగా జరగాలంటే కొవ్వు తప్పనిసరి. అలాగే ఏ, బీ, ఈ, కే విటమిస్లు కొవ్వులో మాత్రమే కరిగి ఒంటికి పడతాయి. అందుకే ఆహారంలో తగినంత నూనె, కొవ్వు లేకపోతే రకరకాల చర్మసమస్యలు, విటమిన్ లోపాలు వంటివి మొదలవుతాయి. అలాగని ఇష్టం వచ్చినంత నూనె తినకూడదు. రోజుకు మనిషికి 20 గ్రాములకు మించకుండా నూనె వాడుకోవటం అలవాటు చేసుకోవాలి.
గుడ్డు మానేస్తే: గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంద కాబట్టి దాన్ని తినకూడదనుకుంటారు చాలామంది. గుడ్డులోని తెల్లసొనలో ఆల్బుమిన్, మాంసకృత్తులు ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. పచ్చసొనలో కొలెస్ట్రాల్‌తోపాటు ఇంకా విటమిన్- ఏ, ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి కూడా ఉంటాయి. అందుకని మామూలుగా ఉన్నవాళ్లందరూ రోజూ ఒక గుడ్డు తినొచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉన్నవారు, గుండెజబ్బులూ హైబీపీ ఉన్నవారు మాత్రమే పచ్చసొన తీసేసి తినొచ్చు.
పాలూ నెయ్యీ మానేస్తే: పాలు పిల్లలకు సంపూర్ణ ఆహారం. పెద్దలకు అందులో ఉన్న కొవ్వు తప్ప మిగిలినవన్నీ అవసరమే. వయసు పెరిగేకొద్దీ ఎముకలు కుంగిపోకుండా చూసే కాల్షియం పాలలోనే ఉంటుంది. కాబట్టి స్త్రీలూ పురుషులూ కూడా కొవ్వు తీసేసిన పాలు తాగవచ్చు. నెయ్యి పిల్లలకు చాలా అవసరం. అందులో సహజసిద్ధమైన విటమిన్-ఏ ఉంటుంది. పెరిగే పిల్లలకూ, కష్టపడి పనిచేసేవారికీ, క్రీడాకారులకూ రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల లాభమే కానీ నష్టం లేదు. అయితే నెయ్యి శాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి అసలు శారీరక శ్రమ చేయని వారూ, రోజంతా కూర్చుని ఉండేవారూ, వృద్ధులూ దాన్ని పూర్తిగా మానెయ్యడమే మంచిది.
చక్కెర కూడా: ఎలాంటి పోషకాలూ లేని చక్కెరని కేవలం రుచికోసం వాడుతున్నాం. అది కెలొరీలను పెంచుతుంది. తీపి పానీయాల్లాంటి వాటిల్లో ఉండే ఫ్రక్టోజ్ రకం చక్కెర లెప్టిన్ హార్మోన్ పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి దాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది.
రోజుకు రెండుసార్లే తిన్నా బరువు పెరుగుతామెందుకు?
ఎన్నిసార్లు తిన్నామన్నదానికన్నా ఎంత, ఏ వేళకు తింటున్నామన్నది ముఖ్యం. పొద్దున్నే టిఫిన్ ఎగ్గొట్టడం, మధ్యాహ్నం ఆకలితో ఆబగా తినడం, మళ్లీ రాత్రి వరకూ ఏమీ తినకుండా ఉండి పడుకోబోయే ముందు సుష్టుగా భోజనం చేయడం.. ఈరోజుల్లో చాలామంది చేస్తున్నదే. ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండటమూ ఒకేసారి పొట్ట బరువయ్యేలా తినడమూ మంచిది కాదు. భోజనానికీ భోజనానికీ మధ్య చాలా సమయం ఉంటే శరీరం గ్లూకోజు స్థాయులను సరిదిద్దటానికి కార్టిజోల్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయాల్సివస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొంచెం కొంచెం చొప్పున ఎక్కువ సార్లు తినాలి.
ఓ మోస్తరుగా భోజనం
పొద్దున్నే ఎక్కువ పోషకాలు ఉండేలా అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం ఓ మోస్తరుగా ఉండాలి. రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని పడుకోవటానికి రెండు గంటల ముందు తినాలి. పొద్దున్న అల్పాహారానికీ మధ్యాహ్నభోజనానికీ మధ్య ఒకసారి, సాయంత్రం మరోసారి స్నాక్స్ రూపంలో ఆరోగ్యకరమైన తినుబండారాలో, పండ్లో తీసుకోవాలి. ఇలా ఐదారుసార్లు తిన్నా తక్కువ మోతాదులో తింటారు కాబట్టి లావవరు, బరువు పెరగరు. రాత్రి పనేమీ చేయకుండా పడుకోవటం వల్ల అప్పుడు తిన్నదంతా కెలొరీలుగా ఖర్చవక కొవ్వుగా మారిపోతుంది. బరువుని పెంచుతుంది. అందుకే రాత్రి భోజనం త్వరగానూ, తక్కువగానూ చేయాలనేది.
మన చేతిలో పనే!
అధిక కొవ్వు ఉండే పదార్థాలకు ప్రత్యామ్నాయాల వాడకంతో కొలెస్ట్రాల్ సమస్యని చాలావరకు తగ్గించుకోవచ్చు. మాంసం బదులు సోయా వాడొచ్చు. 2019లో టొరంటోలో జరిగిన ఒక పరిశోధనలో సోయాతో తయారైన ఆహారం తీసుకున్నవారిలో చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గినట్లు తెలిసింది. పొద్దున్నే అల్పాహారంగా నానబెట్టిన బాదం పప్పు, అరటి పండు లాంటివి కలుపుకుని ఓట్స్ జావ తాగడం మంచిది. ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకన్ అనే పదార్థం ఒకలాంటి జెల్ లాగా తయారై ఆహారనాళంలోనే కొలెస్ట్రాల్ కణజాలాన్ని తనతో కలిపేసుకుని రక్తంలో చేరకుండా అడ్డుకుంటుందని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ పరిశోధనలో వెల్లడైంది.
చిన్న విషయంగా భావిస్తారు
ఆకలి వేసినప్పుడు బిస్కట్టో, కేకుముక్కో, చాక్‌లెట్టో నోట్లో వేసుకోవడం చాలామందికి అలవాటు. పైగా దాన్ని చాలా చిన్న విషయంగా భావిస్తారు. నిజానికి దాని దుష్ప్రభావం ఆరోగ్యం మీద చాలా ఎక్కువ. వాటి బదులు నట్స్ తినాలి. వాటిల్లో అయితే ప్రొటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాలు... లాంటి ఎన్నోరకాల పోషకాలు ఉంటాయి. బాదం, పిస్తా, జీడిపప్పు, అక్రోట్లు, ఖర్జూరాలు, వేరుసెనగపప్పు... వీటిల్లో మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండెకు మంచిది. బాదం పప్పును రోజూ స్నాక్‌గా తీసుకుంటే ఎల్‌డీఎల్ స్థాయులు తగ్గి హెచ్‌డీఎల్ స్థాయులు పెరిగినట్లు 2017లో దక్షిణ కొరియాలో జరిగిన ఒక పరిశోధనలో వెల్లడైంది. వ్యాయామంతో కండరాలకు పనిచెప్పినా కొవ్వు కరిగిపోతుంది. వేగంగా నడవడం, ఏరోబిక్ వ్యాయామాలు, సైక్లింగ్, ఈత, బరువులు ఎత్తడం, యోగా లాంటివి కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అధ్యయనం ఏం చెబుతోంది!
ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో దాదాపు నలభై ఏళ్ల పాటు సాగిన అతి పెద్ద పరిశోధన తాలూకు నివేదిక ఒకటి ఇటీవల వెలువడింది. దాని ప్రకారం పాశ్చాత్యదేశాల వారు కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూ పోతుంటే ఆసియా దేశాలవారు మాత్రం రక్తంలో హానికర కొవ్వుని పెంచుకుంటున్నారట. మొత్తం పదికోట్ల మందికి పైగా వ్యక్తుల నుంచి రక్తం నమూనాలను తీసుకుని.. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ నేతృత్వంలో వందలాది పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేశారు. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్, వెల్కమ్ ట్రస్టు కలిసి ఆ అధ్యయన ఫలితాలను విశ్లేషించి చూడగా.. అధిక ఆదాయం ఉన్న పాశ్చాత్య దేశాల్లో రక్తంలో హానికర కొవ్వు స్థాయులు బాగా తగ్గాయి. మధ్య ఆదాయం ఉన్న ఆసియా దేశాల్లో చెడుకొవ్వు పెరుగుతూనే ఉంది.
ఇదీ చూడండి : పోటాపోటీ.. ట్రిపుల్ ఐటీలో సీట్లకు లాటరీ పద్ధతి.?