రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబపాలన కొనసాగిస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు తరుణ్‌చుగ్ మండిపడ్డారు. తెరాస పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాష్ట్ర మహిళలు కేసీఆర్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని ఆయన ధ్వజమెత్తారు. నాగోల్ శుభం కన్వెన్షన్‌లో నిర్వహించిన భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నేతలను బాగున్నారా అంటూ తెలుగులో పలకరించిన తరుణ్ చుగ్ సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చలేదని మండిపడ్డారు. మహిళలు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఫల్యాలను వివరిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలనను పారద్రోలేందుకు తెలంగాణ మహిళా మోర్చా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
తెరాస పాలనలో విచ్చలవిడి దోపిడి, కబ్జాలతో రాష్ట్రం నాశనమయిందని భాజపా జాతీయ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు. తెలంగాణలో మరో ఉద్యమం రావాల్సిన అవసరముందని తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని భాజపా మహిళా నాయకులకు సూచించారు.