తెలంగాణలో లింగనిష్పత్తి గత మూడేళ్లలో క్రమంగా మెరుగవుతూ వస్తోంది. కేంద్ర జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన 2019 జనన మరణ లెక్కల ప్రకారం తెలంగాణలో లింగనిష్పత్తి గత మూడేళ్లలో 4.15% మేర పెరిగింది. జన్మసమయంలో లింగనిష్పత్తి (సెక్స్‌రేషియో ఎట్ బర్త్) తెలంగాణలో 2017లో 915 (1000 మంది బాలురకు 915 మంది బాలికలు) ఉండగా, 2018 నాటికి 924, 2019 కల్లా 953కి చేరింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో లింగనిష్పత్తి ఎక్కడిదక్కడే ఉంది. 2017లో అక్కడ 935 ఉండగా, 2018లో 931, 2019లో మళ్లీ 935కి చేరింది. పెద్దరాష్ట్రాల్లో గత మూడేళ్లలో నిలకడగా లింగనిష్పత్తి పెరుగుతూ పోతున్న 4 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
- అత్యధిక లింగనిష్పత్తి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశంలో అరుణాచల్‌ప్రదేశ్ (1024), నాగాలాండ్ (1001)ల్లో జనన సమయంలో లింగనిష్పత్తి అత్యధికంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మిజోరం (975), అండమాన్ (965) కేరళ, ఉత్తరాఖండ్ (960), తెలంగాణ (953) నిలిచాయి.
- 2019లో తెలంగాణలో 4,30,652 మంది బాలలు, 4,10,616 మంది బాలికలు జన్మించారు. మొత్తం జననాల్లో బాలుర వాటా 51.19% కాగా, బాలికల వాటా 48.80% మేర ఉంది.
- తెలంగాణ జనాభా 2019 మధ్య నాటికి 3,72,83,000కి చేరింది. ఇక్కడ జననాల రేటు 16.9, మరణాల రేటు 6.5 మేర ఉంది. జననాల నమోదు 100% జరుగుతున్నా, మరణాల నమోదు 97.2%కి పరిమితమైంది.
- ఆంధ్రప్రదేశ్‌లో 7,54,939 మంది పుట్టగా జనాభా 5,23,15000కు చేరింది. ఇక్కడ సంభవించిన జననాల్లో 9.2 శాతం, మరణాల్లో 100 శాతం నమోదయ్యాయి.
- 2019లో తెలంగాణలో 6,30,083 జననాలు నమోదవుతాయని అంచనావేస్తే అవి 8,41,268 (33.51% అధికం)కి చేరాయి.
- మరణాలు 2,34,883 మేర సంభవిస్తాయని అంచనావేస్తే 2,28,294 (-2.80%)కి తగ్గాయి.
- రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 3,13,554 మంది జన్మించగా, అత్యల్పంగా వరంగల్ గ్రామీణ జిల్లాలో 4465 జననాలు నమోదయ్యాయి.
- రాష్ట్రంలో ఏడాదిలో జరిగిన మరణాల్లో అత్యధిక వాటా 28.76 (65,676) హైదరాబాద్‌దే ఉంది. అత్యల్ప మరణాలు 0.60 (1,377) జనగామ జిల్లాలో చోటుచేసుకున్నాయి.
తెలంగాణలో 65 దాటాక అధిక మరణాలు...
ప్రజలు ఏ వయసులో ఎంత మంది మరణిస్తున్నారనే వివరాలను ప్రతి పదేళ్ల కాలవ్యవధి ఆధారంగా లెక్కించారు.
- తెలంగాణలో మొత్తం మరణాలు 2.28 లక్షలుంటే అందులో 61 శాతం మంది 65 ఏళ్ల వయసు తరవాతే కన్నుమూశారు. వయసు వారీగా పరిశీలిస్తే తెలంగాణలో 65 నుంచి 69 ఏళ్ల మధ్య అత్యధికంగా 91,161 మంది అసువులు బాశారు. ఈ విషయంలో తమిళనాడుకన్నా తెలంగాణలో జీవనకాలం మెరుగ్గా ఉంది. తమిళనాడు మరణాల్లో 19 శాతం మంది 55 నుంచి 64 ఏళ్ల మధ్య, మరో 11 శాతం మంది 65 నుంచి 69 మధ్య వయసులో ఉన్నాయి. కానీ తెలంగాణలో 55 నుంచి 64 ఏళ్ల మధ్య మరణాలు 17 శాతం, 65 నుంచి 69 మధ్య 40 శాతం ఉన్నాయి. ఏపీలో 70 దాటాకా కన్నుమూస్తున్నారు...
- ఆంధ్రప్రదేశ్‌లో 2019లో మొత్తం 4,01,472 మంది కన్నుమూయగా అత్యధికంగా 35.41 శాతం మంది 70 ఏళ్ల వయసు దాటినవారే ఉన్నారు.
- తెలంగాణ మరణాలతో పోల్చి చూస్తే ఏపీలో 65 నుంచి 69 ఏళ్ల మధ్య వయసులో మరణాలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ఈ వయసు మరణాలు 40 శాతముంటే ఏపీలో 11.97 శాతమే. కానీ ఏపీలో 70 తరవాత మరణాలు అధికంగా ఉంటున్నాయి.
- ఏపీలో మహిళల మరణాల్లోనూ 70 ఏళ్లలోపు వారిలో తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు 55 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు గల వారిలో పురుషులు 43,667 మంది కన్నుమూస్తే మహిళలు అందులో 64 శాతం అంటే 28,024 మాత్రమే ఉన్నారు.
![](https://assets.eenadu.net/article_img/ghmain-8c_17.jpg)
![](https://assets.eenadu.net/article_img/ghmain-8d_7.jpg)
![](https://assets.eenadu.net/article_img/ghmain-8e_3.jpg)
![](https://assets.eenadu.net/article_img/ghmain-8f1.jpg)
![](https://assets.eenadu.net/article_img/ghmain-8h.jpg)
ఇదీ చూడండి: Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!