జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనతను సాధించింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) యొక్క ఎయిర్‌పోర్ట్స్ హెల్త్ అక్రిడిటేషన్(ఏహెచ్ఏ)ను ఈ సందర్భంగా అందుకుంది. ఏసీఐ యొక్క ఏవియేషన్ బిజినెస్ రీస్టార్ట్ అండ్ రికవరీ గైడ్ లైన్స్ అండ్ మార్గదర్శకాలు, ఐసీఏఓ (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) యొక్క కౌన్సిల్ ఏవియేషన్ రికవరీ టాస్క్ ఫోర్స్ (సీఏఆర్టీ) సిఫారసులతోపాటు.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేపట్టిన కఠినమైన ఆరోగ్య చర్యలకు ఈ గుర్తింపు దక్కింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ గుర్తింపు పొందిన మొదటి విమానాశ్రయాల్లో హైదరాబాద్ విమానాశ్రయం ఒకటిగా నిలిచింది.
రోజూ 20 వేల మంది ప్రయాణీకులు
వచ్చివెళ్లే ప్రయాణికులు, బదిలీలు, రవాణా సేవలు, ఆహార, పానీయ సేవలు, ఎస్కలేటర్లు, ఎలివేటర్లు, లాంజ్‌లు, బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియా మొదలైన చోట్ల తీసుకున్న ఆరోగ్య, భద్రతాపరమైన చర్యలను ఏసీఐ సమీక్షించింది. ఉద్యోగులు, స్టేక్ హోల్డర్స్ భద్రత, శ్రేయస్సు కోసం విమానాశ్రయం తీసుకున్న కార్యక్రమాలను కూడా ఈ సమావేశంలో పరిశీలించారు. ప్రయాణీకుల విశ్వాసం పొందిన హైదరాబాద్ విమానాశ్రయం ఇప్పటికే పునరుద్ధరణ దారిలో ఉంది. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి రోజూ సుమారు 20 వేల మంది డొమెస్టిక్ ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. రోజూ సుమారు 200 విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. కొవిడ్‌కు ముందు ఉన్న 55 దేశీయ గమ్యస్థానాలలో 51 గమ్యస్థానాల పునరుద్ధరణతో హైదరాబాద్ ఇప్పుడు భారతదేశంలో సెకెండ్ బెస్ట్ కనెక్టెడ్ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ప్రయాణీకుల సంఖ్య పరంగా హైదరాబాద్ నుంచి మొదటి ఐదు గమ్యస్థానాలు-ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ముంబై ఉన్నాయి.
“ప్రయాణీకులు మొత్తం విమానాశ్రయంలోని ఇతర భాగస్వాముల భద్రత పట్ల మాకున్న నిబద్ధతను ఏసీఐ విమానాశ్రయం హెల్త్ అక్రిడిటేషన్ తెలియజేస్తుంది. ఇది అందరి సహకారంతోనే సాధ్యమైంది. ఈ సంక్షోభ సమయంలో పూర్తి నిబద్ధతతో పని చేసిన విమానాశ్రయంలోని సిబ్బంది అందరికీ మేము కృతజ్ఞతలు. ఈ అసాధారణ సమయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రభుత్వ నూతన నియమాలను అనుగుణంగా చాలా వేగంగా స్పందించింది. అదే సమయంలో ప్రతి ఒక్కరికీ అత్యంత ఆరోగ్య, పరిశుభ్రతతో అత్యవసర సేవలను అందించింది.”
- శ్రీప్రదీప్ పనికర్ సీఈఓ, జీహెచ్‌ఐఎల్
పరిశుభ్రత ముఖ్యం
కొవిడ్-19 అనంతరం విమానాశ్రయం పున:ప్రారంభానికి ముందు ప్రయాణీకుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి పరిశుభ్రత ముఖ్యమైన ప్రమాణాలలో ఒకటిగా మారింది. ఆధునాతన చర్యలతో, ప్రయాణికులు, విమానాశ్రయంలో పని చేస్తున్న వారికి సురక్షితమైన స్క్రీనింగ్ అనుభవాన్ని, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిరంతరం కృషి చేస్తోంది. కాంటాక్ట్-లెస్ చెకిన్ కియోస్క్‌లు, విమానాశ్రయంలోకి కాంటాక్ట్-లెస్ ప్రవేశం, ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్ కోసం యూవీ శానిటైజేషన్ టన్నెల్, సురక్షిత షాపింగ్ కోసం యూవీ ఓవెన్స్, టచ్-లెస్ ఎలివేటర్, ఫాస్టాగ్ కార్ పార్కింగ్, విమానాశ్రయానికి వచ్చే అన్ని క్యాబ్‌ల శానిటైజేషన్ వంటివి వీటిలో కొన్ని.
‘‘హెల్త్ అక్రిడిటేషన్ పొందిన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మా శుభాకాంక్షలు. ఇది ప్రయాణికులు, వారి ఉద్యోగులు, భాగస్వాములు, ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల వారికున్న నిబద్ధతను, ఆసక్తిని తెలియజేస్తుంది. విమానాశ్రయ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగాల్సిన నేపథ్యంలో విమాన ప్రయాణంపై ప్రజలకు విశ్వాసం పెంపొందడం చాలా ముఖ్యం. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఆరోగ్య, పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా ప్రజలు, ప్రయాణికులకు అందించడం ద్వారా హైదరాబాద్ విమానాశ్రయం మిగతా వాటికి ఆదర్శంగా నిలుస్తోంది."
- శ్రీ లూయిస్ ఫెలిప్ డీ ఒలివేరియా, డైరెక్టర్ జనరల్, ఏసీఐ
పలు విధానాలను అంచనా
కొవిడ్ మహమ్మారి కారణంగా విమానాశ్రయాలు అవలంబిస్తున్న నూతన ఆరోగ్య చర్యలు, విధానాలను పరిశీలించడానికి జూలై 2020లో ఏసీఐ ఎయిర్‌పోర్ట్స్ హెల్త్ అక్రిడిటేషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) కౌన్సిల్ ఏవియేషన్ రికవరీ టాస్క్‌ఫోర్స్ (సీఏఆర్టీ) సిఫారసులకు అనుగుణంగా విమానాశ్రయాన్ని శుభ్రపరచడం, భౌతిక దూరం, సిబ్బంది రక్షణ, ఫిజికల్ లే అవుట్, ప్రయాణీకుల సౌకర్యాలు వంటి విధానాలను అంచనా వేస్తారు. సీఏఆర్టీ మార్గదర్శకాలు-ఏసీఐ ఏవియేషన్ బిజినెస్ రీస్టార్ట్ అండ్ రికవరీ గైడ్ లైన్స్, విమానాశ్రయాలలో ఆరోగ్యకరమైన ప్రయాణీకుల అనుభవానికి ఏసీఐ యూరప్ మార్గదర్శకాలు, యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ కరోనా ఏవియేషన్ హెల్త్ సేఫ్టీ ప్రోటోకాల్‌తో అనుసంధానమై ఉన్నాయి.
ఇదీ చూడండి : కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన వోల్వో కారు