Hyderabad as Robo Hub : మానవ వనరుల కొరతతో అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో రోబోల వాడకం భారీగా పెరుగుతోంది. దక్షిణ కొరియా, తైవాన్, జపాన్ దేశాల్లోనూ రోబోలను ఎప్పటి నుంచో వాడుతున్నారు. మన దేశంలోనూ రోబో రంగంపై ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది. దీంతో రోబోల ఆవిష్కరణలకు, మార్కెటింగ్‌కు రాబోయే కాలంలో భారీగా అవకాశాలు ఉన్నాయని వరల్డ్ రోబోటిక్స్ రిపోర్ట్-2022 పేరిట "ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్" ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Telangana Robotics Innovation Centre in Hyderabad : సాంకేతిక రంగంలో సత్తా చాటుతున్న తెలంగాణ సర్కార్ రోబోటిక్స్‌పై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ‘రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్’ పేరిట కొత్త వ్యూహాన్ని ఆవిష్కరించింది. రాబోయే తరాలను రోబోటిక్స్‌లో నిపుణులుగా తయారు చేసేందుకు విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుంటుంది. స్కూల్ దశ నుంచే రోబోటిక్స్ పైనా అవగాహన పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది.
TRIC as T hub in Hyderabad : రాష్ట్రంలో ప్రస్తుతం రోబోటిక్స్‌పై పనిచేస్తున్న సంస్థలు 1,200 నుంచి 1,500 వరకు ఉన్నట్లు అంచనా. ఈ రంగంలో ప్రస్తుతం వీటిపైన పనిచేసే నిపుణుల సంఖ్య తక్కువగా ఉంది. ఇప్పటికే చిన్న రోబోటిక్స్ సంస్థలు నిర్వహిస్తున్న వారికి అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానమూ అంతంతమాత్రంగానే ఉంది. మార్కెటింగ్, సాంకేతికత కూడా నామమాత్రంగానే అందుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి టీ-హబ్ తరహాలో రోబోటిక్స్‌కు కూడా కేంద్రీకృత వ్యవస్థ అవసరమని, అప్పుడే మరింత అభివృద్ది బాట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ‘తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్(ట్రిక్)’ పేరిట ప్రత్యేక రోబోటిక్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తుంది.
Telangana Robotics Innovation Centre in Telangana : ఆవిష్కరణల నుంచి మార్కెటింగ్ వరకు అనుసంధానకర్తలా వ్యవహరించే విధంగా ఈ సంస్థను తీసుకురాబోతుంది. దీనిలో భాగంగానే టీ-హబ్, డబ్ల్యూఇ-హబ్, టీ-వర్క్స్, టాస్క్, టీఎస్‌ఐసీ, ఆర్‌ఐసీహెచ్ సంస్థలను రోబోటిక్స్‌లో చేర్చనుంది. ఇటీవల దీనికి సంబంధించిన రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించింది. ఈ మేరకు ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక రంగం, వినియోగదారుల రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యాసంస్థల్లో రోబోల్యాబ్స్ : రోబోటిక్స్ చదువులోకి విద్యార్థులను ఆకర్షించే విధంగా విద్యాసంస్థల్లో రోబో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో, పరిశ్రమల భాగస్వామ్యంతో ‘రోబోటిక్స్ టెక్ రీసెర్చ్ ప్రోగ్రామ్’తో పరిశోధనల ప్రోత్సాహానికి ప్రభుత్వం చేయూతనందిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విద్యా సంస్థల్లో నైపుణ్యాన్ని చూపుతున్న విద్యార్థులను ఇంకా ప్రోత్సాహించేందుకు ఫెలోషిప్స్ అందిస్తోంది.
రోబోటిక్స్ రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌లో పనిచేసేందుకు ముందుకొచ్చే తెలంగాణ వర్సిటీలను అంతర్జాతీయ విద్యాసంస్థలతో అనుసంధానం చేస్తుంది. ఈ మేరకు విద్యా సంస్థలను దశల వారీగా అనుసంధానం చేయడానికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ రోబోటిక్స్ సంస్థతో ఐఐఐటీ(హైదరాబాద్) కలిసి పనిచేస్తోంది. ట్రాక్టర్ల తయారీ రంగంలో ఉన్న జాన్‌డీర్ పరిశ్రమ హైదరాబాద్ సంస్థలో కలిసి పని చేయ్యడానికి ముందుకొచ్చింది. మరిన్ని సంస్థలూ కలిసి పని చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నాయి.
ప్రస్తుతం రోబోటిక్స్‌కు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్‌ది పదో స్థానం. ఈ రంగంలో మనకు అవకాశాలు భారీగా ఉన్నాయి. 2021లో ప్రపంచవ్యాప్తంగా 5,17,385 ఇండస్ట్రియల్ రోబోలను అమర్చారు. వాటిలో మన దేశంలో కేవలం 4,900 మాత్రమే ఉన్నాయి. వీటి అవసరం క్రమ క్రమంగా పెరుగుతోంది. రోబోల తయారీ రంగంలో గ్లోబల్ హబ్‌గా ఏర్పడాలన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
Robotics In Hyderabad : ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగుండటం వల్ల కలిసొస్తుంది. సంస్థలు చేసిన ఆవిష్కరణలు విజయవంతం కాకపోతే అనుసంధాన పరిశ్రమలు భారీగా నష్టపోతాయి. గతంలో ఇలాంటి పరిస్థితే డ్రోన్స్ తయారీ రంగం ఎదుర్కుంది. దాన్ని బీమా పరిధిలోకి తీసుకురడానికి రాష్ట్ర సర్కార్ విస్తృత కసరత్తు చేసింది. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ-ఐఆర్‌డీఏ)ని మన ప్రభుత్వం ఒప్పించడంతో దేశవ్యాప్తంగా ఆ పరిశ్రమలు బీమా పరిధిలోకి వచ్చాయి. రోబోటిక్స్‌దీ ప్రస్తుతం అదే పరిస్థితి. ఈ రంగాన్ని కూడా బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంది.
ఇవీ చదవండి: