ఇంటర్ ఫలితాల అవకతవకలను తీవ్రంగా పరిగణించిన భాజపా ప్రభుత్వ వైఖరిని, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ఆందోళన ఉద్ధృతం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్స్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.
దీక్ష కొనసాగుతోంది...
లక్ష్మణ్‌తో సహా తామంతా శాంతియుతంగా దీక్ష చేస్తుండగా పోలీసులతో అక్రమ అరెస్ట్‌లు చేయించి శిబిరం ధ్వంసం చేసిన విధానం అప్రజాస్వామికమని కేంద్రమాజీ మంత్రి దత్తాత్రేయ అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో లక్ష్మణ్ దీక్ష కొనసాగిస్తున్నారని.. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు భాజపా పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు ప్రగతి భవన్ ముట్టడించనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఆ తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా మే 2వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.
పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి చేతకాదు..
ఇంటర్ పరీక్షలు నిర్వహించడం చేతకాని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానిదని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆరోపించారు. కేంద్రం కూడా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడ వద్దని సూచించారు.
ఇవీ చూడండి: నేడు మూడో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం