group-1 applications: తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్-1 ప్రకటనకు భారీ డిమాండ్ కనిపించింది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే అవకాశం ఉండటంతో నిరుద్యోగులు, ఉద్యోగార్థులు పెద్దఎత్తున పోటీపడి రికార్డు స్థాయిలో దరఖాస్తు చేశారు. గడువు ముగిసే నాటికి (జూన్ 4) మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు.
చివరి నిమిషంలోనే ఎక్కువ...
గ్రూప్-1 దరఖాస్తులకు మే 2 నుంచి కమిషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. తొలుత రోజువారీ దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వచ్చినప్పటికీ, గడువు ముగుస్తున్న కొద్దీ భారీ సంఖ్యలో వచ్చాయి. మే 2 నుంచి 16వరకు రోజుకు సగటున 8వేల చొప్పున 1,26,044 దరఖాస్తులు, మే 17 నుంచి 29 వరకు సగటున 10,769 చొప్పున 1,40,539 వచ్చాయి. తొలుత ప్రకటించిన గడువు చివరి రెండు రోజుల్లో (మే 30, 31తేదీల్లో) సగటున 42,500 చొప్పున 85వేల దరఖాస్తులు, గడువు జూన్ 4 వరకు పొడిగించిన తరువాత నాలుగు రోజుల్లో కలిపి 28,559 దరఖాస్తులు అందాయని కమిషన్ వెల్లడించింది.
225 పోస్టులు మహిళలకే..
గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా, ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. జనరల్ పోస్టుల్లోనూ మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందేందుకు అవకాశముంది. దివ్యాంగుల కేటగిరీలో గల 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు. 51,553(15.33శాతం)మంది ప్రభుత్వ ఉద్యోగులూ దరఖాస్తు చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష తేదీలను తరువాత వెల్లడిస్తామని, తదుపరి సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవీ గణాంకాలు...
పురుషులు : 2,28,951
మహిళలు : 1,51,192
ట్రాన్స్‌జెండర్లు : 59
ఇదీ చూడండి..
Group 1: ముగిసిన గ్రూప్-1 దరఖాస్తుల గడువు.. గతంతో పోలిస్తే భారీగా..!