కరోనా సంక్షోభం పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిన తరుణంలో తెలంగాణకు కొత్తగా వస్తున్న పెట్టుబడి ప్రతిపాదనలు ఆశాజనకంగా మారాయి. పలు బహుళజాతి, దేశీయ సంస్థలు రాష్ట్రంలో వివిధ రంగాల్లో కొత్త పరిశ్రమల స్థాపనకు.. వ్యాపారాల విస్తరణకు ముందుకు వస్తున్నాయి. కరోనా సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను, సంస్థలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు దృశ్యమాధ్యమాల ద్వారా నిర్వహిస్తున్న సదస్సులలో విస్తృతంగా పాల్గొని.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం సానుకూలతలు, సరళతర వ్యాపార నిర్వహణలో అగ్రపథంలో నిలవడం, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం సానుకూలంగా, సౌకర్యవంతంగా ఉంటుందని వివరిస్తున్నారు. చైనా నుంచి తరలించే పరిశ్రమలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూముల లభ్యత, మౌలిక వసతులు, ఇతర అంశాలతో నివేదిక పంపించారు. వీటి పర్యవసానంగా రాష్ట్రానికి రూ.43,847.56 కోట్ల మేరకు పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించడం ద్వారా 83,044 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఈ పరిశ్రమలకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. భూ కేటాయింపుల ప్రక్రియ మొదలైంది. టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు జారీ చేస్తున్నారు.
రంగం | పెట్టుబడులు (కోట్లలో) | ఉపాధి పొందే వారి సంఖ్య |
ఐటీ | 25,000 | 1,425 |
ఎలక్ట్రానిక్స్ | 16.891.56 | 73,750 |
జీవశాస్త్రాలు | 1,200 | 1,000 |
ఆహార శుద్ధి | 892 | 2,613 |
స్టీలు | 764 | 1,556 |
జౌళి | 650 | 1,500 |
ఆటోమొబైల్ | 450 | 1,200 |
రానున్న పరిశ్రమలివే
- టీలో డేటా కేంద్రాలు
- ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్తగా ఈవీ, ఈసీఎస్ పార్క్, లీ అయాన్ సెల్స్, బ్యాటరీల పరిశ్రమ, వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్ల పరిశ్రమ, టీవీల తయారీ పరిశ్రమలు
- స్టీల్, భవన నిర్మాణ సామగ్రి రంగంలో ప్రీఫ్యాబ్రికేటెడ్ పరికరాలు, టైర్ల తయారీ, స్టీల్ ఉత్పత్తుల పరిశ్రమలు
- జీవశాస్త్రాల రంగంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు
- ఆహారశుద్ధి రంగంలో హైడ్రోపోనిక్స్, కోడి మాంసం శుద్ధి, పచ్చి మొక్కజొన్న ఉత్పత్తులు, విత్తనశుద్ధి, బిస్కట్ల తయారీ, బియ్యం ఉత్పత్తులు, పండ్ల రసాల పరిశ్రమలు
- ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ
- జౌళి ఉత్పత్తుల పరిశ్రమలు
ఇవీ చూడండి: బీమా ఉన్నా సొమ్ము కడితేనే కరోనాకు చికిత్స