లాక్డౌన్ కారణంగా క్షౌరశాలలు మూసి వేసినందున.. తమను ఆదుకోవాలని నాయీ బ్రాహ్మణ యువ సంఘం రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ సంఘం అధ్యక్షుడు బి. ధన్రాజ్ లేఖలో పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి, వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం, రూ. 1,500 ఇస్తోందని.. తమకు వర్తించేలా సర్కారును ఆదేశించాలని కోరారు. విచారణ జరిపిన ధర్మాసనం.. నాయీ బ్రాహ్మణులను ఆదుకోవడానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వానికి ఎవరిపై వివక్ష లేదని.. అందరినీ ఆదుకుంటోందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని సర్కారును హైకోర్టు ఆదేశించింది.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు