కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏప్రిల్, మే నెలలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదని ప్రశ్నించింది. కరోనా పరీక్షలకు సంబంధించి విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, చెరుకు సుధాకర్, విశ్రాంత డీఎంహెచ్ఓ రాజేందర్, వరుణ్ సంకినేని తదితరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి బెంచ్... ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
ర్యాండమ్ పరీక్షలేవి?
ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాలకు కొవిడ్- 19 పరీక్షలు జరపాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. కోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని... విచారణ జరగాల్సి ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ చేపట్టి నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజల్లో ర్యాండమ్ పరీక్షలు జరపాలని ఆదేశించినప్పటికీ.. అమలు చేయడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
అందుకే వైద్య సిబ్బందికీ కరోనా..
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి రక్షణ కిట్ల పంపిణీపై ప్రభుత్వ నివేదిక అసమగ్రంగా ఉందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. తగినంత రక్షణ కిట్లు ఇవ్వనందుకే రాష్ట్రంలో వైద్య సిబ్బందికి కరోనా సోకిందని వ్యాఖ్యానించింది. కరోనాపై మీడియా బులెటిన్లలో తప్పుడు సమాచారం ఇస్తే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది. ప్రజలకు వాస్తవాలు తెలియకపోతే.. వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించింది. కరోనా తీవ్రత పెరుగుతోందన్న వాస్తవం ప్రజలకు తెలియాలని పేర్కొంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత భౌతిక దూరం వంటి జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.
17లోగా నివేదిక సమర్పించండి..
ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై పత్రికలు, టీవీల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకపోతే వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజా రోగ్య శాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేసి కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో ఈనెల 17లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఇవీ చూడండి: కరోనా అప్డేట్స్: తెలంగాణలో కోవిడ్‌పై ఇవాళ ఏం జరిగిందంటే?