Highcourt on Group-1 Exam : ఈనెల 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ యథాతథంగా జరగనుంది. పరీక్ష వాయిదా వేసేందుకు నిరాకరించిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది. ప్రశ్నపత్రాల లీకేజీతో గత అక్టోబరులో నిర్వహించిన.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దైంది. అయితే టీఎస్‌పీఎస్సీ పాలకమండలి, సిబ్బందిలో మార్పులు చేయకుండా.. మళ్లీ వారితోనే పరీక్ష నిర్వహించడం సరికాదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదావేయాలని.. యూపీఎస్సీ వంటి సంస్థకు అప్పగించాలన్న పిటిషన్లపై జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ విచారణ చేపట్టారు.
అన్ని జాగ్రత్తలతో పారదర్శకంగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు చేసినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానానికి తెలిపారు. సుమారు 3 లక్షల 80 వేల మంది పరీక్ష రాయనున్నారని.. ఇప్పటికే లక్షన్నర మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 995 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తు కొనసాగుతోందని త్వరలోనే ఛార్జీషీట్ దాఖలు చేయనున్నట్లు ఏజీ వివరించారు. కొందరి అభ్యంతరాల కోసం లక్షలాది విద్యార్థుల్లో గందరగోళం చేయవద్దని.. ధర్మాసనాన్ని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు పరీక్ష వాయిదా వేసేందుకు నిరాకరించింది.
అసలేం జరిగిదంటే : టీఎస్‌పీఎస్సీ పరీక్షల లీకేజీకి సంబంధించి సిట్‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు పూర్తయ్యేదాక.. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించడంపై అభ్యంతరం ఉందని.. యూపీఎస్సీలాంటి మూడో సంస్థకు ఈ బాధ్యతను అప్పగించాలని వారు పిటిషన్‌లో కోరారు.
Petition in High Court to Postpone Group-1 exam : గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన పరీక్షలను రద్దు చేయడంతో పాటు.. ఈనెల 11న గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ అశోక్ కుమార్‌తో పాటు మరో నలుగురు రమేశ్,సుధాకర్‌లు వేర్వేరుగా హైకోర్టులో మూడు పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటన : ఏప్రిల్ 26, 2022న.. 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటనకు.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించారు. ఈ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. కానీ ఈ క్రమంలోనే పేపర్ లీకేజీ కారణంతో టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్షను రద్దు చేసింది. తిరిగి ఈనెల 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనుంది.
ఇవీ చదవండి:TSPSC Group-1 Prelims Exam : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు.. ఆ విధానంలోనే ఎగ్జామ్