రిజిస్ట్రేషన్‌లు అన్నింటినీ నిలిపివేస్తూ రిజిస్ట్రేషన్ శాఖకు సెలవులు ప్రకటించడంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖకు సెప్టెంబరు 8 నుంచి సెలవులు ప్రకటిస్తూ సెప్టెంబరు 7న ప్రభుత్వం ఇచ్చిన జీవో.102ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్నారం నాగరాజు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున కె.బుచ్చిబాబు వాదనలు వినిపిస్తూ రిజిస్ట్రేషన్ శాఖకు సెలవులు ప్రకటించడం వల్ల పలు ఒప్పందాలు అమలుకాకుండా పోయాయన్నారు.
వాణిజ్య, వ్యాపార, అద్దె, తాకట్టు, లీజు, పలు బ్యాంకు ఒప్పందాలు తదితరాలు నిలిచిపోయి కార్యకలాపాలు స్తంభించిపోయాయన్నారు. సెలవులు ఎన్ని రోజులన్నది నిర్దిష్టంగా పేర్కొనలేదని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా అని పేర్కొన్నారన్నారు. ఇది సహజ న్యాయసూత్రాలకు, తెలంగాణ రిజిస్ట్రేషన్ చట్టానికి విరుద్ధమని తెలిపారు. జీవో 102ను కొట్టివేసి తక్షణం రిజిస్ట్రేషన్‌లకు అవకాశం కల్పించాలని కోరారు. కనీసం రిజిస్ట్రేషన్‌లను అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించగా ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంది. విచారణను డిసెంబరు 10కి వాయిదా వేసింది.
గిరిజన ప్రాంతాల్లో నిర్మాణాలకు పాస్‌బుక్‌లు జారీ చేయొద్దు
గిరిజన ప్రాంతాల్లోని నిర్మాణాలకు హక్కులను నిర్ధారిస్తూ మెరూన్ (ముదురు ఎరుపురంగు), ఇతర పాస్‌బుక్‌లను జారీ చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. గిరిజన ప్రాంతాల్లోని నిర్మాణాలకు పాస్‌బుక్‌ల జారీని సవాలు చేస్తూ తెలంగాణ ఆదివాసి సంక్షేమ పరిషత్, తెలంగాణ వ్యార్ది సంక్షేమ పరిషత్‌లు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వి.రమణ వాదనలు వినిపిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా, రైతువారీ పట్టాలు తీసుకోకుండా గిరిజన ప్రాంతాల్లోని నిర్మాణాలకు పాస్‌బుక్‌లు జారీచేయడం గిరిజన ప్రాంతాల్లో భూబదలాయింపు నిబంధనలకు విరుద్ధమన్నారు. పాస్‌బుక్‌ల జారీ నిమిత్తం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అక్టోబరు 3న జారీచేసిన మెమో చెల్లదన్నారు. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ కౌంటరు దాఖలు చేయడానికి గడువు కోరారు. దీంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఎలాంటి పాస్‌బుక్‌లు జారీ చేయరాదంటూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను 19కి వాయిదా వేసింది.
- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ